కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 విధించిన సంగతి తెలిసిందే. తొలి విడత విధించిన 21 రోజుల లాక్ డౌన్ వల్ల బడుగు, బలహీన వర్గాలు, నిరు పేదలు, దినసరి కూలీలు, వలస కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు…తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ పొడిగించడంతో వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అటువంటి వారికి ఆపన్న హస్తం అందించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, సినీ తారలు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. తమకు తోచిన విరాళాలిచ్చి తమ వంతు సాయం చేశారు.
ఇక, ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు తమకు తోచినంతలో నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. వీరంతా దాదాపుగా పట్టణాల్లో, గ్రామాల్లో వాటిని పంపిణీ చేస్తున్నారు. అయితే, తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సీతక్క మాత్రం తన రూటే సెపరేటు అంటున్నారు.
20 ఏళ్ల వయసులో గన్ చేతబట్టినా…ఇపుడు ప్రజాప్రతినిధిగా గన్ మెన్ లు పక్కన ఉన్నా…తన జీవితం ప్రజాసేవకే అంకితమంటున్నారు సీతక్క. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే తన లక్ష్యం అని అంటున్నారు సీతక్క. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు సీతక్క…ములుగు పరిసర ప్రాంతాల్లోని మారుమూల పల్లెలె, కుగ్రామాలకు స్వయంగా వెళ్లి అక్కడి పేద ప్రజలు, ఆదివాసీలు, అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నారు.
కేవలం నిత్యావసరాలే కాకుండా, రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు పాలు,పండ్లు కూడా అందిస్తూ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరెందరో ప్రజా ప్రతినిధులకు రోల్ మోడల్ గా సీతక్క నిలుస్తున్నారు. తాను చేస్తున్న సేవలను చూసి మరింతమంది స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశ్యంతో తాను చేస్తున్నసేవాకార్యక్రమాలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తున్నారు సీతక్క. సీతక్క ట్వీట్లు, ఆమె గ్రౌండ్ జీరోలో చేస్తున్న సేవా కార్యక్రమాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ధనసరి అనసూయ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, సీతక్క పేరు తెలియని తెలంగాణ బిడ్డ ఉండడంటే అతిశయోక్తి కాదు. గతంలో మావోయిస్ట్ గా ఆదివాసీల కోసం పోరాడిన సీతక్క అందరికీ సుపరిచతం. అనంతరం జనజీవనంలోకి వచ్చిన సీతక్క టీడీపీ తరఫున 2004లో పోటీ చేసి 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో చందూలాల్ చేతిలో ఓడిన సీతక్క 2019లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి చందూలాల్‌పై విజయం సాధించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలోనే మాస్కుల గురించి ముందుగా హెచ్చరించింది సీతక్కే. కేసీఆర్ పిలుపుతో చాలామంది ఎమ్మెల్యేలు నిరుపేదలను, దినసరి కూలీలను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఎక్కువగా రోడ్ల వెంబడి ఉన్న ప్రాంతాలకే వీరి సాయం పరిమితం అవుతుందనే విమర్శులున్నాయి.
అయితే, ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రం అడవుల్లో తిరుగుతూ, వాగులు వంకలు దాటుతూ.. మారుమూల పల్లెల్లోని నిరుపేదలు, అన్నార్తులు, గిరిజన బిడ్డలకు నిత్యావసరాలను అందజేస్తున్నారు. గతంలో తన చేతిలో తుపాకీ ఉండేదంటోన్న సీతక్క ఇప్పుడు తన చేతిలో బియ్యం, కూరగాయలు ఉన్నాయని చెబుతున్నారు. ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో జిల్లాను నో మూవ్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.
దీంతో, ప్రజలకు నిత్యావసర సరుకులు లభ్యం కావడం లేదు. ఇక, అటవీ, ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండే ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొండలు కోనలు దాటుకొని…వాగులు వంకల్లో నడిచి అక్కడి ప్రజలకు సేవ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే, అటువంటి వారికి తాను అండగా ఉన్నానంటూ సీతక్క ముందుకు వచ్చారు. ములుగు నియోజకవర్గంలోని 700కుపైగా పల్లెలుండగా…వాటిలోని 320 గ్రామాల్లో బియ్యం, కూరగాయలను సీతక్క పంపిణీ చేశారు.
ఎడ్ల బండి మీద, ట్రాక్టర్ నిత్యావసరాలు, కూరగాయలు తీసుకువెళ్లి అందిస్తున్న సీతక్క…అవసరమైతే భుజాల మీద మోస్తూ నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇంకా సగానికి పైగా గ్రామాలకు నిత్యావసరాలు పంపిణీ చేయాల్సి ఉందన్న సీతక్కకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. తనతో పాటు కొందరు యువత రోజుకు 12 కి.మీ. నడుస్తున్నారని.. బియ్య మూటలను భుజాలపై మోస్తున్నారని ప్రశంసిస్తున్నారు సీతక్క.
కేవలం నిత్యావసరాలు పంచడంతో సరిపెట్టుకోని సీతక్క…. కరోనా బారిన పడకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను కూడా గిరిజనులకు వివరిస్తున్నారు. అక్కడి ప్రజలు, గిరిజనులకు సోషల్ డిస్టెన్సింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. గురించి చెబుతున్నారు. గతంలో తాను నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు గిరిజనులు తన ఆకలి తీర్చారని…ఇప్పుడు వారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు సీతక్క. కరోనాను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ఉండాలని, ఆదివాసీలకు కేవలం రేషన్ బియ్యం ఇస్తే ఇమ్యూనిటీ ఎలా సమకూరుతుందని ప్రశ్నిస్తున్నారు సీతక్క. అందుకే నిత్యావసరాలతోపాటు గుడ్లు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ సీతక్క చేస్తున్న సాహసం, సేవపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్టీలను పక్కనబెట్టి మరీ ఆమె చేస్తున్న పనులను అభినందిస్తున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సీతక్క వైరల్ అవుతున్నారు. సీతక్క తరహాలోనే రాష్ట్రంలో మిగతా ప్రజాప్రతినిధులు ఎందుకు కష్ట పడటం లేదని నెటిజన్లు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణతోపాటు దేశలోని చాలామంది ప్రజాప్రతినిధులకు సీతక్క రోల్ మోడల్ గా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.
This post was last modified on April 23, 2020 1:33 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…