కన్నాకు షాక్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభాగంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చింది అధిష్టానం. రెండేళ్లకు పైగా పదవిలో కొనసాగుతున్న సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణపై వేటు వేసి సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించారు. ఈ విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ ‌సింగ్‌ ఉత్తర్వులు వెలువరించారు. వీర్రాజు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ భాజపా శాఖలకు కొత్త అధ్యక్షులు నియమితులవుతారని కొన్ని నెలల ముందు నుంచే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే తెలంగాణ బీజేపీకి బండి సంజయ్‌ను అధ్యక్షుడిని చేయగా.. ఇప్పుడు ఏపీకి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించారు.

తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒకప్పుడు ఏపీ బీజేపీలో కీలకంగా ఉన్న వీర్రాజుకు మధ్యలో ప్రాధాన్యం తగ్గింది. ఇప్పుడు అధ్యక్షుడిగా నియమితుడు కావడంతో ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేయడం చాలామందికి మింగుడు పడనిదే. ఎందుకంటే ఆయనకు జనాల్లో ఏమంత ఆదరణ లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది ఒకే ఒక్కసారి.

2009 ఎన్నికల్లో బీజేపీ టికెట్ మీదే రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన ఆయన కేవలం 0.7 శాతం ఓట్లు.. అంటే 7,123 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. అలాంటి నేతను ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా చేసిన అధిష్టానం ఏం సాధిస్తుందో చూడాలి. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కూడా పెద్దగా సాధించిందేమీ లేదు. గత ఏడాది ఎన్నికల్లో ఆయన కూడా డిపాజిట్ కోల్పోయారు. గత ఏడాది కాలంలో కొన్ని వివాదాలతో ఆయన ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలోనే ఉద్వాసన తప్పలేదు.