విశాఖ పట్నం జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన పవన్ కళ్యాణ్ పర్యటన ఆది నుంచి కూడా.. ఉత్కంఠకు దారితీసింది. సర్కారు ఈ పర్యటనపై వెయ్యి కళ్లతో నిఘాను ఏర్పాటు చేసిందనే వాదన జనసేన నుంచి వినిపిస్తోంది. నిన్న జరిగిన గర్జన సభ అనంతరం.. మంత్రులు, వైసీపీ నాయకుల వాహనాలపై దాడి చేశారన్న ఆరోపణలతో పలువురు జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి యత్నించినవారిని గుర్తించి సెక్షన్ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.
మంత్రి రోజా, తదితర నాయకులు విమానాశ్రయానికి వచ్చినపుడు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వారిని దూషించి, రాళ్లతోనూ, పార్టీ జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అక్కడ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కూడా జరిగిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడారని వెల్లడించారు. పెందుర్తి పోలీసుల సిబ్బంది, దిలీప్‌కుమార్, సిద్ధు, సాయికిరణ్, హరీష్ తదితరులకు బలమైన గాయాలయ్యాయన్నారు. కారకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
మరోవైపు.. పోలీసులు రాత్రి పొద్దుపోయాక పవన్ బసచేస్తున్న నోవోటెల్ హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. హోటల్లో వపన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి , పోలీసులకు మధ్య వాదప్రతివాదాలు తీవ్రస్థాయిలో చోటు చేసుకున్నాయి. అయినా.. పోలీసులు వారిని పక్కకు నెట్టి.. హోటల్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు.. తమ పార్టీ నేతలైన సుందరపు విజయ్‌కుమార్, పీవీఎస్ఎన్ రాజులను అరెస్టు చేసినట్లు జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది.
నేతలను విడుదల చేయకుంటే స్టేషన్‌కు వస్తా: పవన్
విశాఖలో పోలీసులు అరెస్టుచేసిన జనసేన నేతలను వెంటనే విడుదల చేయకుంటే పోలీసుస్టేషన్‌కు వచ్చి… వారికి సంఘీభావం ప్రకటిస్తానని పవన్‌కల్యాణ్ స్పష్టంచేశారు. ‘జేఎస్పీ ఎప్పుడూ రాష్ట్ర పోలీసు బలగాలను ఎంతో గౌరవిస్తోంది. అనవసరంగా అరెస్టు చేసిన మా పార్టీ నేతలను విడుదల చేయించాలని డీజీపీని కోరుతున్నా’ అని పవన్ ట్వీట్ చేశారు. మరిదీనిపై పోలీసులు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates