తమ్మినేని అసలు టార్గెట్ అదేనట

సాధారణంగా రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండేవారు రాజకీయల గురించి మాట్లాడరు. ఒకవేళ ఏదో అరకొరగా మాట్లాడినా పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. కానీ, ఏపీలోని సీనియర్ పొలిటిషియన్లలో ఒకరు, ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం తరచుగా అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఏదో ఒకటి రెండు సార్లు అంటే సందర్భాన్ని బట్టి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయనుకోవచ్చు. కానీ, దాదాపుగా అన్ని సార్లు అటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారంటే…దాని వెనుక ఏదో బలమైన కారణం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమ్మినేని వ్యాఖ్యల వెనుక ఉద్దేశం వేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు రాజ్యాంగబద్ధమైన పదవి కంటే…తన రాజకీయ అనుభవానికి సరితూగే రాజకీయ పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తమ్మినేని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారనన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీలో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు…జగన్ ఖాళీ చేస్తారని ప్రచారం జరుగుతోన్న మరో రెండు మంత్రి పదవుల్లో…ఒక దానిని తనకిస్తే బాగుంటుందని తమ్మినేని ఇన్నర్ ఫీలింగ్ అని అంటున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో తమ్మినేని ఒకరు. అటు పాత…ఇటు కొత్త…నేతలకు మధ్య సమన్వయ కర్తగా…మంచి వాగ్ధాటి ఉన్న నేతగా తమ్మినేనికి పేరుంది. గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉన్న తమ్మినేనికి స్పీకర్ పదవినిచ్చి గౌరవించారు జగన్. అయితే, మంత్రి కావాలన్న కోరిక ఉన్న తమ్మినేని…ఆ విషయాన్ని ప్రత్యక్షంగా బయటపెట్టే అవకాశం లేదు. అందుకే, పరోక్షంగా…ప్రెస్ ముందుకు వచ్చి స్పీకర్ కు సంబంధం లేని రాజకీయ అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల…ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం ఎక్కువైందన్న అభిప్రాయాన్ని తమ్మినేని వ్యక్తం చేశారు. ఇక, అదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన అంత దూకుడుగా లేకపోయినా…. విపక్షాలపై తమ్మినేని మాత్రం విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుతో మొదలుపెడితే…జిల్లా స్థాయి నాయకులపైనా ఎడాపెడా విమర్శలు గుప్పిస్తున్నారు.

అసెంబ్లీలోనూ టీడీపీ నేతలపై తమ్మినేని ఆగ్రహావేశాల వెనుక ఈ కారణం కూడా ఉందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే, ప్రత్యక్ష రాజకీయాలపై ఇంత ఆసక్తి ఉన్నతమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వాలని విపక్షాలు కూడా చెవులు కొరుక్కుంటున్నాయట. స్పీకర్ తమ్మినేని ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీడియా ముందు మైక్ అందుకుంటోంది అందుకేనట. మరి, ఈ పుకార్లు….మీడియాలో తమ్మినేని వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.