దేశంలో డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైయస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం మండిపడ్డారు. ఎక్కడ చూసినా విధ్వంసం బాగా ఉందని, అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. జగన్ రాత్రి పబ్జీ గేమ్ ఆడుతారని, పొద్దున్నే సైకోలా ప్రజలపై పడతారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు కుటుంబాన్ని కలిసి పరామర్శించిన అనంతరం లోకేష్ మాట్లాడారు.
సంక్షేమం, అభివృద్ధి కోసం వైసీపీని ప్రజలు గెలిపించారని, జగన్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీపై కక్ష కట్టారని, తమ నాయకులు, కార్యకర్తలు, బడుగుబలహీన వర్గాల ప్రజలపై పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మద్యం, ఇసుక, 108 అంబులెన్స్ వంటి వాటిల్లో వైసీపీ నేతల అవినీతికి అంతు లేదన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కూన రవికుమార్ కేసు పెట్టారని, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పెళ్లికి వెళ్తే కేసులు పెట్టారని, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారని, ఇంతకంటే దారుణం లేదని అభిప్రాయపడ్డారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడికి ఎలాంటి పాత్ర లేదన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న, పోరాడుతున్న వారిని జైలుకు పంపించి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మాట్లాడినందుకు ఓ వృద్ధురాలిపై కూడా కేసు పెట్టారన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates