తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చినట్లేనా..? పోవడమే కానీ రావడం తెలియని ఆ పార్టీకి ఆ సీనియర్ నేత చేరికతో సరికొత్త జోష్ వచ్చిందా..? దీని వెనుక ఒక కీలక నేత చక్రం తిప్పారా..? ఒక మంచి అవకాశాన్ని బీజేపీ వదులుకుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు ఇస్తున్నాయి ఆ పార్టీలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కుటుంబం తాజాగా కాంగ్రెసులో చేరిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పేరు వింటేనే అయ్యో అంటూ జాలి చూపిస్తున్నారు ప్రజలు. అది నిన్నటి వరకు. తెలంగాణ ఇచ్చి కూడా 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయింది ఆ పార్టీ. ఇచ్చిన పార్టీ కంటే కూడా తెచ్చిన కేసీఆర్ పైనే నమ్మకం ఉంచారు జనాలు. వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఇవ్వడంతో ప్రస్తుతం ఆ సెంటిమెంటుకు కాలం చెల్లినట్లు అయింది. ఇక ప్రత్యామ్నాయం వైపు చూడడం మొదలు పెట్టారు ప్రజలు. అది అందిపుచ్చుకునేందుకు రేవంత్ రూపంలో కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
వరుస ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు కీలక నేతలు, ఎమ్మెల్యేల వలసలతో చచ్చుబడిపోయింది ఆ పార్టీ. ఇక్కడ నుంచి వెళ్లడమే తప్ప రావడం అంటూ జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన డీఎస్, కేశవరావు, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ తదితర నేతల వలసలతో కునారిల్లిపోయింది. రేవంత్ వచ్చాకే పార్టీలో కదలిక వచ్చింది. మళ్లీ అధికారంపై ఆశ కనిపించింది. తొలిసారి ఇతర పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి.
ముఖ్యంగా తొలి అడుగు వేసింది.. కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం తీసుకొచ్చింది చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. ఉద్యమ నేతగా పేరున్న ఓదెలు ఆది నుంచీ కేసీఆర్ తోనే పనిచేశారు. వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్రితం ఎన్నికల్లో ఆయనను పక్కనపెట్టి బాల్క సుమన్ కు అవకాశం ఇచ్చారు కేసీఆర్. దీంతో సుమన్ ఓదెల కుటుంబాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఈ అవమానాలను భరించలేని ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ గా ఉన్న ఆయన సతీమణితో సహా హస్తం గూటికి చేరారు.
తొలుత ఓదెలు బీజేపీలో చేరాలనుకున్నారట. అయితే టికెట్ పై ఆ పార్టీ నేతలు హామీ ఇవ్వకపోవడం.. కోల్‌బెల్ట్ ప్రాంతంలో బీజేపీపై వ్యతిరేకత ఉండడంతో ఓదెలు మనసు మార్చుకున్నారట. దీన్ని గుర్తించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు టీపీసీసీ చీఫ్ రేవంతుతో చర్చలు జరిపి, టికెట్ హామీ వచ్చేలా చేశారట. దీంతో వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరిపోయారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పట్టున్న ప్రేంసాగర్ రావు ఈరకంగా తన బలం నిరూపించుకున్నారు. పార్టీలో నేతల చేరికల కోసం వెంపర్లాడుతున్న బీజేపీనేమో మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఈ చేరికల వ్యవహారాలు మున్ముందు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
This post was last modified on May 21, 2022 3:40 pm
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…