తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా సాగుతోంది. అక్కడ ఆ పార్టీ పరిస్థితి మెరుగవుతోంది. కానీ ఏపీలో చూస్తే ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. సమర్థవంతమైన నాయకత్వం లేక క్షేత్రస్థాయిలో బలం లేక ఏదో మాటలతో సరిపెడుతోంది. కానీ ఇప్పుడు ఏపీలో ఆ పార్టీకి పుంజుకునే అవకాశం వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఆ పార్టీకి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు. బీజేపీ కూడా ఆ దిశగానే సాగుతోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కారణంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలను తమ వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ప్లాన్‌గా తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ వైసీపీలో పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి. తాజాగా మాజీలైన మంత్రులు, మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత జగన్ తీరుపట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇప్పుడా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అసంతృప్త నేతలు ఇప్పుడే వైసీపీని వీడకపోవచ్చు. కానీ భవిష్యత్లో మాత్రం సమయం చూసి జగన్‌ను దెబ్బ కొట్టే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి నుంచే బీజేపీ ఆ నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుందని టాక్.
వైసీపీలో జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎదురుండదు. కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కారణంగా కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ అసంతృప్త నేతలను బుజ్జగించాల్సింది పోయి జగన్ హెచ్చరిస్తుండడంతో పరిస్థితి తారుమారైంది. శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తామని ప్రకటించిన అసంతృప్తులకు వీలైనంత త్వరగా ఆ పని చేయండి.. అవసరమైతే ఉపఎన్నికలకు వెళ్తామని అధిష్టానం వారికి హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో నష్టపోవడం ఎందుకని చెప్పి వాళ్లు సైలెంట్ అయిపోయారు.
అయితే పదవి దక్కలేదని అసంతృప్తి మాత్రం వాళ్లను వెంటాడుతూనే ఉండే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు కాకపోయినా 2024 ఎన్నికల నాటికైనా పార్టీ మారే ప్రయత్నాలు చేయొచ్చు. ఇదే అదునుగా బీజేపీ అసంతృప్తులకు గాలం వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పదవి దక్కని, తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తితో ఉన్నవాళ్లతో బీజేపీ నేతలు సంప్రదింపులకు తెరతీశారని టాక్. వీళ్లు చేరితే పార్టీ బలోపేతమవడం ఖాయమనే అభిప్రాయం కాషాయ దళంలో ఉంది. అందుకే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లోనైనా వీళ్లను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.