తెలంగాణ బడుల కోసం సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలుగు భాష‌పై త‌న‌కు ఎంతో మ‌క్కువ‌ని.. తాను పోత‌న భాగవతం, భార‌తం, రామాయ‌ణం వంటివాటిని ఔపోస‌న ప‌ట్టాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్ర‌వేశ పెట్టేందుకు ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ విష‌యాన్ని.. కేసీఆర్ మంత్రుల‌కు వివ‌రించ‌డం.. గ‌మ‌నార్హం.

మ‌రో 5 మాసాల్లో ప్రారంభం కానున్న విద్యా సంవ‌త్స‌రం నుంచి ఈ ఆంగ్ల మీడియాన్ని ప్ర‌వేశ పెట్టేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. దీనికి సంబంధించి అధ్య‌య‌నం చేసేందుకు త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ ఉప‌సంఘాన్ని కూడా నియ‌మిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులు ఇంగ్లీష్ విష‌యంలో వెనుక‌బ‌డి పోతున్నార‌ని.. వ‌చ్చే భ‌విష్య‌త్తు అంతా కూడా.. ఆంగ్ల మాధ్య‌మంపైనే ఆధార‌ప‌డి ఉంద‌ని.. కాబ‌ట్టి ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఇంగ్లీష్ మీడియంను ప్ర‌వేశ పెట్ట‌డం త‌ప్పుకాద‌ని.. సీఎం కేసీఆర్ చెప్ప‌డం విశేషం.

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చ‌ర్చించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య-ఆరోగ్య శాఖ సన్నద్ధతను మంత్రి హరీశ్ రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు ఇచ్చినట్లు హరీశ్‌ రావు వెల్లడించారు. అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సహకారం తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. శాఖల సమన్వయంతో వాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు.

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు పర్యటనలో పాల్గొననున్నారు. వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, మరిన్ని ఆంక్షల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 30వ తేదీ వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యాబోధన విషయమై మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించారు. మొత్తానికి కేసీఆర్ తీసుకున్న ఆంగ్ల మీడియం నిర్ణ‌యం ఏవిధంగా వివాదం అవుతుందో అని ప‌రిశీలకులు అంటున్నారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై ఇప్ప‌టికే కోర్టుల్లో కేసులు దాఖ‌లైన విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు.