డా.సుధాకర్ సంచలన కామెంట్స్ – జగన్ దేవుడు !!

నర్సీపట్నం వైద్యుడు డా. సుధాకర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మాస్కుల గురించి మీడియా ముందు ప్రశ్నించిన కొద్ది రోజులకే సస్పెండైన ఆయన చాలాకాలం కనిపించలేదు. సడెన్ గా ఓ రోజు వైజాగ్ నడిరోడ్లో కనిపించారు. కారులో నుంచి దిగడం, జగన్ ని తిట్టడం, పోలీసులు తాళ్లతో కట్టి లాఠీలతో కొట్టడం, తన్ని కింద పడేయడం, ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్చడం… హైకోర్టు ఆయన కేసును సీబీఐకి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

అయితే సడెన్ గా ఈరోజు ట్విస్ట్ ఇచ్చాడు డా.సుధాకర్. జగన్ దేవుడు అని, రాజకీయాలతో నాకు సంబంధం లేదు అని, రాజకీయాల కోసం నన్నెవరూ వాడుకోలేదన్నారు. చంద్రబాబు, జగన్ అందరూ బాగా పాలిస్తున్నారని మరో చిత్రమైన సంబంధం లేని కామెంట్ కూడా చేశారు. మొన్న ఆస్పత్రిలో డిశ్చార్జి అయ్యే వరకు ఒక వెర్షను వినిపించిన సుధాకర్ డిశ్చార్జి అయినా కొద్ది రోజులకే ఇలా కొత్త వెర్షనులో మాట్లాడటం వెనుక ఏం జరిగిందా అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు దీని వెనుక వ్యవహారమేంటో తమ రాజకీయ జ్జానంతో ఒక అంచనాకు వస్తున్నారు.

కోర్టు కేసును సీబీఐకి ఇచ్చిన అనంతరం సుధాకర్ తల్లి చేసిన కామెంట్స్ ఇక్కడ ప్రస్తావనార్హం. మా కొడుక్కి ఉద్యోగం తిరిగి ఇస్తామన్నారు. మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు. కానీ ఇపుడు వెనకడుగు వేస్తే మాకు అండగా నిలిచి వారిని అవమానించినట్టు అవుతుంది. అందుకే ఈ పోరాటం కొనసాగిస్తామని ఆమె వ్యాఖ్యానంచారు. ఎపుడైతే సీబీఐ విచారణ మొదలైందో అప్పటి నుంచి అందరూ సైలెంటుగా ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. మరిపుడు ఏం జరిగింది. ఎందుకు సుధాకర్ సడెన్ గా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు?

మరికొన్ని విషయాలను కూడా సుధాకర్ ప్రస్తావించారు. ’’సస్పెండ్ అయినప్పటి నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ఆస్పత్రిలో చంపేస్తామని కూడా బెదిరించారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన తప్పు. తనకు గుండు గీసిందెవరో చెబితే కొత్త గొడవలు మొదలవుతాయి. పేదల సేవ కోసం డాక్టరుగా పనిచేస్తున్నాను. ఇపుడు జీతం రాక ఇబ్బంది పడుతున్నాను. నా ఉద్యోగం నాకు ఇప్పించండి. రాజకీయాలంటే అసహ్యం. ఉద్యోగమే నాకు ముఖ్యం’’ అని సుధాకర్ కొత్తగా మాట్లాడారు.