తెలంగాణలో ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పదేపదే హౌస్ అరెస్ట్ చేస్తే ఆ పార్టీ శ్రేణుల అధినాయకత్వం నుంచి ఎలాంటి తీవ్రమైన స్పందన లేదు.. మరో పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని అరెస్టు చేసి జైల్లో పెడితే మాత్రం ఆ పార్టీ హైకమాండ్ వెంటనే ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుంటే.. బీజేపీ మాత్రం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు పోటీనిచ్చేది బీజేపీ మాత్రమే అనేలా వేగంగా అడుగులు వేస్తోంది.
అధిష్ఠానం మద్దతు..
తెలంగాణలో పట్టు కోసం అధికార కుర్చీని పట్టుకోవడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుకు పార్టీ అధిష్ఠానం అండగా నిలవడంతో పట్టాపగ్గాలు లేకుండా ముందుకు సాగుతోంది. వరి కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రం చేసిన ఆరోపణలు సమర్థంగా రాష్ట్ర నాయకత్వం తిప్పికొట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ విజయం తర్వాత ఆ పార్టీలో మరింత జోష్ వచ్చింది.
ప్రధాని మోడీ, కేంద్రం హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని భావించి రాష్ట్ర బీజేపీ నాయకులను పిలిపించుకుని దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పుడు బండి సంజయ్ అరెస్టుతో హైకమాండ్ రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంజయ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక ఆరెస్సెస్ సమావేశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంజయ్ అరెస్టుకు నిరసనగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
అంతర్గత పోరు..
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ప్రధాన సమస్యగా మారాయి. ఒకప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ అనేలా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి బీజేపీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో బలం, క్యాడర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ రెండు సార్లు అనుమతి లేదంటూ ఆయన్ని పోలీసులు ఇల్లు దాటనివ్వలేదు. హౌస్ అరెస్టు చేశారు.
కానీ దీనిపై ఆ పార్టీ నాయకులు పెద్దగా స్పందించనే లేదు. ఎలాంటి ఆందోళనలకూ పిలుపునివ్వలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ తన సొంత జిల్లాలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి తనకు సమాచారం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రేవంత్‌కు పార్టీలోని కొంతమంది సీనియర్లకు పడడం లేదన్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌లో పార్టీ దారుణమైన ప్రదర్శనపై ఢిల్లీలో పంచాయితీ పెట్టిన అధిష్టానం పద్ధతి మార్చుకోవాలని నేతలను హెచ్చరించింది. కానీ వాళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కొనసాగితే కాంగ్రెస్ పుంజుకునే అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on January 6, 2022 2:06 pm
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…