రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. చెప్పడం కష్టం. నాయకుల తలరాతలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. అయితే, నాయకులు ఎవరైనా.. ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేసినా.. నాయకులకు తీరని మచ్చలు ఏర్పడడం.. కోలుకోలేని దెబ్బలు తగలడం కూడా కామనే! ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చర్చించాల్సి వస్తోందంటే.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కీలక నేత విషయం ఆసక్తికర చర్చకు దారితీయబట్టే! త్వరలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనిని అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అయితే.. వీరి మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా తగుదునమ్మా అంటూ.. పోటీ పడుతోంది. వాస్తవానికి ఏడు ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కలేదు. పైగా.. ఇక్కడ కాంగ్రెస్ బలం అంతా కూడా టీఆర్ఎస్‌కు మూకుమ్మడిగా వెళ్లిపోయింది. మరోమాటలో చెప్పాలంటే.. అసలు ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు కూడా లేరు. అయినప్పటికీ.. ఇప్పుడు.. ఇంత ఉత్కంఠ పోరులో.. కాంగ్రెస్ పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. సరే! సహజంగానే.. ఎన్నికలన్నాక పోటీ చేయాలి కాబట్టి చేస్తుందని అనుకున్నా.. అదేసమయంలో అంతే కీలకంగా ఉన్న మహిళా నేత, మాజీ మంత్రి కొండా సురేఖను ఇక్కడ నుంచి పోటీకి దింపాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామం.. కాంగ్రెస్‌కు బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా చూసుకుంటే.. సురేఖకు గొప్ప ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసిందని వార్తలు వస్తున్నాయి. త్వరలో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని కూడా అంటున్నారు. వాస్తవానికి సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ ఇక్కడ పోటీకి పరిశీలించింది. అయితే అంతిమంగా సురేఖ పేరును ఆ పార్టీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో హుజురాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు.
అయితే ఈటల సగం బీసీ, సగం ఓసీ అంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేసింది. టీఆర్‌ఎస్ ఇలా ప్రచారం చేయడమే కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హుజురాబాద్ నుంచి బరిలోకి దింపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు జిల్లాలో విద్యార్థి నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అటు దళిత బంధు పథకంతో ఆ వర్గం ఓట్లను.. ఇటు గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బీసీల ఓట్లను తన ఖాతాలో వేసుకోవాల ని టీఆర్‌ఎస్ ఆశ పెట్టుకుంది. ఇక సురేఖను పోటీలో నిలబెట్టడానికి కాంగ్రెస్‌కు ఓ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలా అంటే సురేఖ భర్త కొండా మురళీది మున్నూరు కాపు సామాజిక వర్గం.
సురేఖది పద్మశాలి సామాజిక వర్గం. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని అంచనాతో ఉంది. ఇక తెలంగాణ అవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికలేవి కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఓటములన్నీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇప్పుడు టీపీసీసీకి కొత్త టీం వచ్చింది. ఈ టీంకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఛాలెంజ్‌గా మారింది. దీంతో ఆచితూచి సురేఖను బరిలోకి దింపాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్ వ్యూహం ఇలా ఉంటే.. మేధావుల మాటేంటంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో హుజూరాబాద్ నుంచి సురేఖ నిలబడ్డా.. గెలుపు గుర్రం ఎక్కలేరని.. ఈటల వర్సెస్ టీఆర్ఎస్‌కే ప్రధాన పోరు ఉంటుందని.. సో.. వేరే వారికి ఈ టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఓడిపోయినా.. నేతలను సంతృప్తి పరిచారనే వాదన ఉంటుందని అంటున్నారు. పోయిపోయి.. ఓడిపోయే టికెట్‌ను తీసుకోవడం కూడా సురేఖకు మంచిది కాదని సూచిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 16, 2021 6:55 am
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…