రెండు పార్టీల నేతలు హడావుడి మొదలుపెట్టేశారు

ఆలులేదు చూలులేదు..అల్లుడి పేరు సోమలింగం అన్న సామెతలాగ తయారైపోయింది అధికార టీఆర్ఎస్-బీజేపీల వ్యవహారం. హుజూరాబాద్ లో ఎప్పుడు జరుగుతుందో తెలీని ఉపఎన్నికల కోసం ఇప్పటి నుండే రంగంలోకి దిగేశాయి రెండు పార్టీలు. అనవసరంగా టెన్షన్ పెంచేసుకుంటున్నారు పై పార్టీల నేతలు. ఎంఎల్ఏ పదవికి మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈటల రాజీనామా చేశారు కానీ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఎవరు చెప్పలేకున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల కమీషన్ మాత్రమే. అలాంటిది ఈరోజే రేపో షెడ్యూల్ వచ్చేస్తుందన్నంతగా నియోజకవర్గంలో పై రెండు పార్టీల నేతలు హడావుడి మొదలుపెట్టేశారు. ఎలాగైనా గెలవాలని ఈటల, ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీయార్ పట్టుదలగా ఉండటం వల్లే నియోజకవర్గంలో టెన్షన్ పెరిగిపోతోంది.

ఈటలపై బురదచల్లేందుకని కేసీయార్ ప్రత్యేకంగా మంత్రి గంగుల కమలాకర్ ను నియోజకవర్గానికి పంపారు. దాంతో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకని మంత్రి ఈటల టార్గెట్ గా ఆరోపణలు, విమర్శలకు తెరలేపారు. పనిలో పనిగా ఈటలకు ఎవరైతే సన్నిహితంగా ఉంటారనే ప్రచారంలో ఉన్నారో వారందరితోను మంత్రి కానీ లేదా ఎవరితో పని జరుగుతుందంటే వారందరితో ఫోన్లో మాట్లాడిస్తున్నారు.

ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలంటు అధికారపార్టీ నుండి వందలాది ఫోన్లు వెళుతున్నాయట. ఇదే సమయంలో తనను గెలిపించటం ద్వారా కేసీయార్ కు బుద్ధి చెప్పాలంటు ఈటల కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన మద్దతుదారులకు, అభిమానులను, కేసీయార్ వ్యతిరేకులతో భేటీలు జరుపుతున్నారు. ఇందుకే ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో హుజూరాబాద్ టెన్షన్ పెరిగిపోతోంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)