ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందరివాడుగా ఉండేవాడు. బేసిగ్గా సినిమా అభిమానుల్లో ఉన్న వర్గాల వల్ల కొంతమందికి నచ్చేవాడు కాదు కానీ.. మెజారిటీ జనాలు ఆయన్ని అమితంగా ఇష్టపడేవాళ్లు. సినిమాలతో వచ్చిన మెగాస్టార్ హీరో ఇమేజ్‌కు తోడు.. బయట ఆయన చేసిన ఎన్నో మంచి పనులు గొప్ప పేరు తెచ్చాయి. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఆయన చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. వివాదాలకు దూరంగా, సాధ్యమైనంత మేర మంచి పనులు చేస్తూ అందరికీ ఇష్టుడిగా ఉన్నాడు చిరు. ఐతే రాజకీయాల్లోకి రావడంతో ఆయన ఇమేజ్ దెబ్బ తినడం మొదలైంది.
పొలిటికల్ లీడర్‌గా జనాల అంచనాలను అందుకోలేకపోవడం, ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం, దాని గురించి ప్రత్యర్థులు పనిగట్టుకుని చేయించిన దుష్ప్రచారం, ఎన్నికల్లో పరాభవం అనంతరం రెండేళ్లు తిరిగేసరికి పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి.. ఆ పార్టీ కండువా కప్పుకుని మంత్రి అయిపోవడం లాంటి పరిణామాలు చిరు ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీశాయి. ఎన్నడూ లేని విధంగా సామాన్యుల్లో, తటస్థుల్లో ఆయన వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్నారు. ఐతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం చిరు నెమ్మదిగా రాజకీయాలకు దూరం కావడం, తిరిగి సినిమాల మీద దృష్టిపెట్టడంతో కథ మారింది. చిరును రాజకీయ నేతగా కంటే సినీ నటుడిగా ఎంతో ఇష్టపడే జనాలు ఆయన్ని తిరిగి ఆదరించడం మొదలైంది. అయినప్పటికీ అంతకుముందు రాజకీయ నాయకుడిగా చిరుపై నెలకొన్న వ్యతిరేకత జనాల్లోంచి పోవడం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు.
కానీ గత కొన్నేళ్లలో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా మారి చేస్తున్న మంచి పనులతో.. వివాదాలకు, రాజకీయాలకు పూర్తిగా దూరమై అందరివాడిగా పేరు తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నంతో ఆయన ఇమేజ్ మారుతూ వచ్చింది. ఇక కరోనా టైంలో చిరు ఏడాది నుంచి చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆయన ఆదుకున్నారు. కార్మికులకు అండగా నిలిచారు. ఇంకా మరెన్నో మంచి పనులు చేశారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటుతో చిరు పట్ల జనాల వ్యతిరేకత పూర్తిగా పక్కకు వెళ్లినట్లే ఉంది. ముందులాగే చిరు మీద ప్రేమను కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుడిగా చిరును తప్పుగా అర్థం చేసుకున్నామా అనే ఆలోచన కూడా కొందరిలో కలుగుతోందంటే అతిశయోక్తి కాదు.