దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు సరిగ్గా 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ కొనసాగింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సిఫార్సు మేరకు.. నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. దీనిని తరచుగా బీజేపీ సహా.. వామపక్షాలు ఇతర పార్టీలు కూడా తప్పుబడుతుంటాయి. ఇందిరాగాంధీని అప్రజాస్వామిక వాదిగా నియంతృత్వ వాదిగా కూడా విమర్శిస్తుంటాయి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏకంగా.. జూన్ 25ను బ్లాక్ డేగా నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఇందిరాగాంధీ పెద్ద కోడలు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఈ వ్యవహారంపై స్పందించారు. తాను రాసుకున్న స్వీయ పుస్తకంలో ఎమర్జెన్సీపై ఆమె కొన్ని పుటలు రాసినట్టు తెలిపారు. అయితే.. ఎమర్జెన్సీని తాను కూడా సమర్థించనని చెప్పారు. కానీ, నాటి పరిస్థితిలో ఇందిరాగాంధీ అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా.. ఎమర్జెన్సీని తప్పుబట్టారని.. పదే పదే అలా చేయొద్దని అమ్మకు చెప్పారని సోనియా వ్యాఖ్యానించారు. ఓ రాత్రి డిన్నర్ సమయంలో మేమంతా కూర్చున్నాం. ఎమర్జెన్సీ గురించి చర్చ వచ్చింది. రాజీవ్.. దీనిని వద్దన్నారు. మరోసారి ఆలోచించాలని కోరారు. కానీ, ఇందిర అక్కడ నుంచి దిగ్గున లేచి వెళ్లిపోయారు అని సోనియా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కారణం ఏంటి?
సోనియాగాంధీ చెప్పిన మాటలను బట్టి.. దేశంలో ఎమర్జెన్సీ విధించడంలో ఇందిరాగాంధీ కంటే కూడా.. ఆమె చిన్నకుమారుడు సంజయ్ గాంధీదే కీలక పాత్ర. ఆయన చెప్పినట్టే ఇందిరమ్మ వినేవారట. అంతేకాదు.. ఎమర్జెన్సీ విధించే విషయంలోనూ సంజయ్ మాటలకే ఆమె ఎక్కువగా విలువ ఇచ్చారని సోనియా వివరించారు. దేశంల ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు.. ఎమర్జెన్సీని మించిన ఆయుధం లేదన్న సంజయ్ గాంధీ వ్యాఖ్యలనే ఇందిర ప్రామాణాకంగా తీసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో సంజయ్‌ను ఇందిరాగాంధీ నిలువరించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని సోనియా పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తాను కూడా ఎమర్జెన్సీ వంటి తీవ్రమైన విషయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
ప్రజలను నిర్బంధించడం, అరెస్టులు చేయడం.. కారణం లేకుండానే అదుపులోకి తీసుకుని జైలుకు తరలించడం, పత్రికల హక్కులను అణిచేయడం వంటి ప్రజాస్వామ్య దేశంలో తగదని సోనియా అభిప్రాయపడ్డారు. కానీ, ఆనాటి పరిస్థితులు ఇందిరాగాంధీని ఉక్కిరి బిక్కిరికి గురి చేశాయన్నారు. ఇలా చేయడం పట్ల ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేయడం తను చూశానని చెప్పారు. అయితే.. ఇతర నాయకులు, కుమారుడు సంజయ్ ఒత్తిడి కారణంగానే ఇందిరా గాంధీ ఇత తీవ్ర నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అయితే.. ఇదేమీ ఇందిర సొంత నిర్ణయం కాదని.. రాజ్యాంగంలోనే ఉందని సోనియా పేర్కొనడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates