బొత్స గారు.. వార‌సురాలినీ గెలిపించుకోలేక పోయారే..!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న మండ‌లిలో విపక్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ వార‌సురాలిగా రాజ‌కీయ అరం గేట్రం చేసిన బొత్స అనూష.. తొలి అడుగులోనే త‌ప్ప‌ట‌డుగు ప‌డింది. ఆమె తాజాగా జ‌రిగిన జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజయం పాల‌య్యారు. టీడీపీ అభ్య‌ర్థి చేతిలో తాజా ఎన్నిక‌ల్లో ఆమె ఓడిపోవ‌డంతో వెంట‌నే పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఆ వెంట వ‌చ్చిన అనుచ‌రులు కూడా ఈసురోమంటూ వెళ్లిపోయారు.

జిల్లా ఎన్నికల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొత్స వార‌సురాలు.. డాక్టర్ బొత్స అనూష పోటీ చేశారు. ఆది నుంచి కూడా ఆమె రంగంలోకి దిగిన త‌ర్వాత‌.. మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని అనుకున్నారు. కానీ.. అనూష‌.. తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండి ఆమె వెనుకంజలోనే కొనసాగి చివరకు ఓటమిని చవిచూశారు.

ఇక‌, ఇదే సీటు నుంచి కూట‌మి త‌ర‌ఫున టీడీపీ అభ్య‌ర్థిగా పాశ‌ల నీర‌జ పోటీ చేశారు. ఈ స్థానాన్ని బీసీల‌కు కేటా యించ‌డంతో పాటు మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వ్ చేశారు. దీంతో ఇరు ప‌క్షాల నుంచి కూడా మ‌హిళ‌లే బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. ఇక‌, త‌న వార‌సురాలిని గెలిపించుకునేందుకు బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌ల‌కు ముందు రెండు రోజులు ఇక్క‌డే మ‌కాం వేశారు. పార్టీ త‌ర‌ఫున నాయ‌కుల‌ను కూడా ముందుకు న‌డిపించారు. త‌న‌ను చూసి ఓటేయాల‌ని ఒక సంద‌ర్భంలో పిలుపునిచ్చారు.

కానీ.. వైసీపీ అభ్య‌ర్థిగా కంటే కూడా.. బొత్స వార‌సురాలిగా ఈ ప‌రాజ‌యం కుటుంబానికి మైన‌స్ అయింది. త‌న మేన‌ల్లుడు మ‌జ్జి శ్రీనివాస‌రావు ఇటీవ‌ల వైసీపీని వీడి.. టీడీపీ చెంత‌కు చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే చాలా వ‌రకు బొత్స‌కు అనుకూల ఓటు బ్యాంకు పోయింద‌ని అంటున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత బొత్స ఒంట‌రి పోరు సాగించినా.. వార‌సురాలిని గెలిపించుకోలేక పోయారు. క‌డ‌ప‌టి వార్త‌లు అందే స‌రికి నీర‌జ 12 వంద‌ల ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగారు. దీంతో బొత్స‌ఫ్యామిలీ సైతం హ‌ర్ట్ అయింది.