ఆరు నెలల్లో ఏడు సార్లు హత్యాయత్నం

పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏమీ మారలేనట్టే కనిపిస్తుంది. మమతా బెనర్జీ పాలనలో మితిమీరిపోయిన రౌడీయిజంతో విసుగెత్తిన ప్రజలు బీజేపీకి ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడక్కడ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారయ్యింది. బెంగాల్ల్లో హింస మరింతగా పెరిగిపోయింది. దానికి తోడు మతోన్మాదం రంకెలు వేస్తుంది. వెరసి ప్రజలకు శాంతి భద్రతలు కరువైపోయాయి. బెంగాల్ లో ఒక ప్రతిపక్ష ఎంపీ మీద ఆరు నెలల్లో ఏడు సార్లు హత్యాయత్నం జరిగిందంటే ఎంత దారుణమైన పరిస్థితి వుందో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు కోల్ కత్తా లోని కాళీ ఘాట్ లో నివాసం వుంటారు. శనివారం ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. టీఎంసీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేడుకల ఏర్పాట్లలో బిజీగా వున్నారు. తెలవారుజాము 2 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటి మీద రాళ్లు, ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని ఎంపీ అభిషేక్ మీడియాకు తెలిపారు.

తనను హతమార్చేందుకు అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించిన ఆయన ఈ ఆరు నెలల్లో తన మీద ఏడు సార్లు దాడికి పాల్పడ్డారని వివరించారు. ఒక ఎంపీ అయిన తన మీద ఏడు సార్లు హత్యాయత్నాలకు పాల్పడ్డారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అస్సలు పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్రంలో టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారని, జాతీయ నాయకుల విగ్రహాలను కూల్చి వేస్తున్నారని, ప్రజలు ప్రాణ భయంతో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఎంపీ అభిషేక్ చేసిన ఆరోపణలను అధికార బీజేపీ ఖండించింది. ఇదంతా ఫేక్ డ్రామా అని కొట్టిపారేసింది. ఆయన మీద బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడలేదని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ఆయన డ్రామాలాడుతున్నారని మండిపడింది. టీఎంసీ పాలన కంటే ఇప్పుడే బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని స్పష్టం చేసింది. దీంతో టీఎంసీ, బీజేపీల మధ్య వేడి రాజుకుంది. పరస్పర ఆరోపణలతో బెంగాల్ రాజకీయాలు గరం గరంగా వున్నాయి.