ఆర్-ఆర్ ట్యాక్స్ ఇంత‌లా వ‌సూలు చేస్తున్నారా?!

తెలంగాణ‌లో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తిప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో వెంచ‌ర్లు వేసేవారు కూడా.. భ‌య‌ప‌డిపోతున్నార‌ని.. ఆర్ ఆర్ ట్యాక్స్ క‌ట్ట‌క‌పోతే.. ఏ ఒక్క అనుమ‌తి కూడా రావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఆర్‌-ఆర్ ట్యాక్స్ కార‌ణంగానే ఇప్పుడు రాజ‌ధాని ప్రాంతంలో భూములు, ఫ్లాట్లు కొన‌లేని ప‌రిస్థితి వ‌చ్చేసింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇక‌, తాజాగా హైద‌రాబాద్ వ‌చ్చి.. రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఈ విష‌యాలు తెలియ‌వా? లేక ఉమ్మ‌డిగా వ‌సూలు చేస్తున్నారా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో.. రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్న ట్యాక్సుల్లో స‌గం రాహుల్‌గాంధీ జేబు ఖ‌ర్చుల‌కు వెళ్తోంద‌ని ఆరోపించారు. అందుకే.. రాష్ట్రంలో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయ‌ని.. ఈ విష‌యాన్ని బీజేపీ నాయ‌కులు ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని నిల‌దీశారు. బీజేపీ అగ్రనేతలు ప్ర‌భుత్వం పై పైపైనే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

అస‌లు రాష్ట్రంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌పై అవ‌గాహ‌న లేదా? అని ప్ర‌శ్నించారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ విమర్శలు చేయడం మినహా కేంద్రం చేసిందేమీ లేదు అని ఎద్దేవా చేశారు. హైద‌రాబాద్‌లో ఏ బిల్డ‌ర్‌ను అడిగినా.. ఆర్‌-ఆర్ ట్యాక్స్ గురించే చెబుతున్నార‌ని అన్నారు. చ‌ద‌ర‌పు అడుగుకు 200 చొప్పున వ‌సూలు చేస్తున్నార‌ని… దీనిలో స‌గం రాహుల్‌గాంధీకి వాటా కింద ఇస్తున్నార‌ని ఆరోపించారు. వ‌సూళ్లు చేస్తున్నార‌ని ప్ర‌ధాని మోడీ కూడా చెబుతున్నా.. చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఇద్ద‌రి మ‌ధ్యా అవ‌గాహ‌న‌..

బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ఈ విష‌యంలో మంచి అవ‌గాహ‌న కుదిరింద‌ని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కేంద్ర పెద్ద‌లు మౌనంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. కాగా.. కేటీఆర్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు చూపాల‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్ ప్ర‌శ్నించారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డానికి కేటీఆర్ గ‌ల్లీ నాయ‌కుడ‌ని తాను అనుకోవ‌డం లేద‌ని.. బాధ్య‌త గ‌ల ప్ర‌జాప్ర‌తినిధి అయితే.. ఆధారాల‌ను చూపించి ప్ర‌శ్నించాల‌న్నారు. లేక‌పోతే.. మౌనంగా ఉండాల‌ని సూచించారు.