11.11.11.11 వెనక కారణం ఏంటో చెప్పిన సాయి రెడ్డి

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్టీ ఏర్పాటు ముహూర్తం చర్చగా మారడం తెలిసిందే. విజయసాయి వైసీపీలోనూ, జగన్ కేసుల్లోనూ నెంబర్ టూగా వున్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడి బయటకు వెళ్లిపోయారు. జగన్ కోటరీ మీద, ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మీద తీవ్రంగా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే….

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఆయన ప్రకటించిన తేదీ జగన్ పార్టీ అసెంబ్లీ సీట్ల సంఖ్యను గుర్తు చేసే విధంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 11 వ నెల 11 వ తేదీ ఉదయం 11 గంటల 11 నిముషాల 11 సెకండ్లకు కొత్త పార్టీ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. వైసీపీ నాయకత్వాన్ని ఉడికించేందుకు ఈ తేదీ నిర్ణయించారా అని మీడియా ప్రతినిధులు విజయసాయిని ప్రశ్నించారు. వాళ్ళు భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను, పండితులు ఈ ముహూర్త బలం బాగుందని ఇచ్చారు అని జవాబిచ్చారు.
తనకు వైసీపీని కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

విజయసాయి రెడ్డి పార్టీ ప్రారంభం కాకుండానే చేరికల బోణి కొట్టారు. టీటీడీ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఓ వి రమణ..సాయి రెడ్డి పార్టీలో చేరారు. ఆయనతో కలిసి టీటీడీ అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పుకున్నారు. తాను వైసీపీలో జాతీయ కార్యదర్శి గా పనిచేసిన విషయం గుర్తు చేసుకున్న ఆయన తనలాగే రమణ కూడా కొత్త పార్టీలో జాతీయ కార్యదర్శిగా వ్యవహారిస్తారని ప్రకటించారు. అంటే పార్టీ ఏర్పాటుకు ముందే కమిటీ జాతీయ కార్యదర్శిని కూడా ఎంపిక చేసేసారన్న మాట.

వైసీపీని వీడి వచ్చినప్పటికి సాయిరెడ్డికి వైసీపీ వాసన మాత్రం పోలేదని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. వైసీపీలో ఆయన కింగ్ మేకర్ పాత్ర పోషించారని, ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్నా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా ఇతరా నాయకుడిని సీఎం చేస్తానని చెప్పడాన్ని విశ్లేషకులు ప్రస్థావిస్తున్నారు. కొత్త ఆలోచనలతో పార్టీ ఏర్పాటు చేయడానికి బదులు పాత వాసనలతో కొత్త పార్టీ ప్రకటించడం వలన ఉపయోగం ఏముంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి.