స్థానిక ఎన్నికల సమరంలో ఇప్పటి వరకు జరిగింది 25 శాతం మాత్రమే!. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరే షన్లకు మాత్రమే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా.. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఇవి మరిన్ని ఎక్కువగా ఉంటాయి. ఇక, గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి తెలిసిందే. సో.. మొత్తంగా ఎన్నికల పర్వం కొనసాగుతోంది. కానీ… ఇప్పటి వరకు జరిగిన స్థానిక ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత జగన్ గగ్గోలు పెట్టారు. అన్యాయం, అక్రమం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ అయినా.. వైసీపీ సీనియర్ నాయకులైనా తెలుసుకోవాల్సింది.. చాలానే ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఎలా వ్యవహరించాలి? ఎలా వ్యవహరించరాదు? అనేదే!. ముఖ్యంగా అధికారం కోల్పోయి 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ప్రత్యర్థులపై సవాళ్లు రువ్వడం.. సై.. అనడం వంటివి మానుకుంటే.. బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి. ప్రధానంగా నామినేషన్ల పర్వం విషయానికి వస్తే.. మరింత ఆలోచనాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
- నామినేషన్ల దాఖలు విషయంలో నాయకులను సమన్వయం చేయడం.. బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కంటే.. నామినేషన్ వేయడమే లక్ష్యంగా ముందుకు సాగి ఉంటే.. ఇబ్బందులు వచ్చేవి కాదన్న అభిప్రాయం ఉంది. నిజానికి నామినేషన్ కేంద్రంలోకి కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో వారినే ఎంపిక చేసి పంపిస్తే.. సజావుగా సాగుతుంది. ఇకపై అయినా.. ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
- స్థానికంగా బల ప్రదర్శన వద్దు: నామినేషన్ల సమయంలో బల ప్రదర్శన చేయడమే ఇప్పటి వరకు వైసీపీకి మైనస్‌గా మారిపోయింది. నిజానికి ఈ ఎన్నికల్లో బల ప్రదర్శన కంటే కూడా.. అభ్యర్థులు బరిలో నిలిచి ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అలా చేయకుండా కొందరు ఎంపీలు రంగంలోకి దిగి.. బలప్రదర్శన చేయడం, ఆధిపత్యం కోసం ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయడమే కొంపముంచింది.
- ఇకపై జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయినా.. జగన్ సహా వైసీపీ నాయకులు పంథాను మార్చుకుంటే మార్పు తథ్యం. కనీసం నామినేషన్ వేసేందుకు అయినా అవకాశం ఉంటుంది. కానీ.. బల ప్రదర్శనలు, సవాళ్లు వంటివి తలకెత్తుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా ఎదుటి పార్టీ వ్యూహాలను అర్ధం చేసుకుని.. ప్రతి వ్యూహాలు వేయాలే కానీ.. ఎదుటి వారి ఉచ్చులో చిక్కుకునేలా మాత్రం ఉండరాదన్నది స్పష్టం అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates