విడాకుల కేసులను గరిష్ఠంగా ఏడాదిలో పరిష్కరించాలని.. సుప్రీంకోర్టు గతంలోనే దేశంలోని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. విడాకుల కేసులలో సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వం చేయాలని.. సాధ్యం కాదని తేలితే.. ఏడాదిలోగా పరిష్కరించవచ్చని తెలిపింది. ఇలా చేయడం వల్ల విడాకుల ద్వారా వేరైన పురుషుడు, మహిళ తమ జీవితాలను కొత్తగా ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని సూచించింది. కానీ.. దేశంలో ఇది అమలు కావడం లేదు.
తాజాగా తెలంగాణ హైకోర్టు ఓ కేసును విచారించింది. హైదరాబాద్‌కు చెందిన దంపతులు.. 14 ఏళ్ల 5 నెలల కిందట హైకోర్టును ఆశ్రయించి.. తమకు విడాకులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిలో భర్త చేసిన ఆర్గ్యుమెంటు కీలకంగా మారింది. తమకు పాప పుట్టిన తర్వాత.. తన భార్య మానసిక స్థితి తప్పిందని, దీంతో తనను వేధింపులకు గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక, తన అత్తమామలు కూడా.. ఇల్లరికం రావాలని కోరుతున్నారని.. కానీ, తాను ఉద్యోగినని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విడాకులు ఇవ్వాలని కోరారు.
అయితే.. ఈ కేసు వాయిదాలపై వాయిదా పడుతూ.. ఎట్టకేలకు తాజాగా విచారణ పూర్తయింది. ఇంతలో.. సదరు భర్తకు ప్రమోషన్ వచ్చి.. జీతం లక్షల్లోకి చేరింది. దీంతో భార్య.. తన కాపురం నిలబెట్టాలని తాజాగా మరో పిటిషన్ వేసింది. నిజానికి 14 ఏళ్ల కిందట వేసిన విడాకుల పిటిషనే తేలకుండా.. ఆమె మరో పిటిషన్ వేయడం.. తన కాపురం నిలపాలని కోరడం గమనార్హం. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేసిన ధర్మాసనం.. భర్త వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేకాదు.. ఇల్లరికం రమ్మనడం నేరం కాదని.. దీనిని వేధింపులుగా చూడకూడదని తెలిపింది.
ఇక, ఈ కేసులో చిత్రం ఏంటంటే.. పిటిషన్ దాఖలు చేసినప్పుడు.. భర్త వయసు 36 ఏళ్లు కాగా, భార్య వయసు 32, పిల్ల వయసు 2 సంవత్సరాలు. కాని.. ఇప్పుడు వీరి వయసులు 50కి.. పిల్ల వయసు 16 ఏళ్లకు చేరిపోయాయి. వీరు విడివిడిగానే ఉంటున్నారు. కాగా.. మరోవైపు తన భార్యతో కలిసి ఉండేది లేదని భర్త తేల్చేశాడు. మొత్తంగా కోర్టు కేసుల విచారణ, ముఖ్యంగా విడాకుల కేసుల్లో కోర్టుల తీర్పులు ఆలస్యమైతే.. పరిస్థితి ఎలా ఉంటుందనడానికి ఈ కేసు ఉదాహరణగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates