అక్క‌డ వైసీపీ జీరో నుంచి మొద‌లెట్టాల్సిందే

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల వేళ ప‌రిణామాలు చూస్తుంటే కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ జీరో అయిపోయింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి గుంటూరు, ఉమ్మ‌డి కృష్ణా, ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి, ఉమ్మ‌డి నెల్లూరు వంటి జిల్లాల్లో కూట‌మి క్లీన్ స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ను ప‌క్క‌న పెడితే.. ఏ పార్టీకైనా కోస్ట‌ల్ రీజియ‌న్ పాలిటిక్స్ అత్యంత కీల‌కం. ఆయా జిల్లాల్లో మెజారిటీ సీట్లు ద‌క్కించుకున్న పార్టీలు అధికారంలోకి రావడం సునాయాసంగా మారుతోంది. అయితే.. గ‌త 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా దెబ్బ‌తింది. కీల‌క‌మైన ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో గుడివాడ వంటి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం కూడా కోల్పోయింది. ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి వెంటాడింది.

అలాగే.. ప‌శ్చిమ గోదావ‌రిలోనూ అలానే ఉంది. మొత్తం 15 అసెంబ్లీ సీట్లకుగాను 2019 ఎన్నికల్లో 13 చోట్ల విజయం సాధించిన వైసీపీ… 2024 ఎన్నికలకు వచ్చేసరికి అసలు అడ్రస్‌ లేకుండా పోయింది. నెల్లూరులోనూ ఇలానే ప‌రిస్థితి మారిపోయింది. వైసీపీ ఆవిర్భావం నుంచి కంచుకోట‌గా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ ఒక్క‌సీటు కూడా గెల‌వ‌లేదు. జ‌గ‌న్ నివాసం ఉన్న గుంటూరులోనూ ఒక్క సీటు నుకూడా ద‌క్కించుకోలేక పోయారు. మాచ‌ర్ల వంటి బ‌ల‌మైన కంచుకోట‌లోనూ విజ‌యం సాధించ‌లేక పోయారు. విజ‌య‌వాడ‌లో మూడు స్థానాలు పోగొట్టుకున్నారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌లలో జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోను ఎర్ర‌గుంట్ల‌, క‌మ‌లాపురంతో పాటు అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలో కూట‌మి అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం అయ్యారు. పులివెందుల‌లో 40 వార్డుల‌కు 21 చోట్ల వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌లేని దుస్థితి. వైసీపీ కంచుకోట పుంగ‌నూరులో 36 వార్డులు, చైర్మ‌న్ ప‌ద‌వి టీడీపీకి ఏక‌గ్రీవం అయ్యింది. ఇలా ఆయా జిల్లాలు, కంచుకోట‌ల్లో ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణాలపై ఇప్పుడు శోధిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే జీరో నుంచి ప‌ని ప్రారంభించాల‌న్న‌ది పార్టీ అధిష్టానం తేల్చి చెబుతున్న సంగ‌తి. తాజాగా ఆయా జిల్లాల నాయ‌కుల‌తో వ‌రుస మీటింగులు పెడుతున్న పార్టీ అధిష్టానం స‌హా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వంటి వారు.. క్షేత్ర‌స్థాయి నుంచి ప‌ని ప్రారంభించాల‌ని సూచిస్తున్నారు. సీనియ‌ర్లు పోయినా.. ఫ‌ర్లేద‌ని అంటున్నారు. జూనియ‌ర్ల తోనే కార్య‌క్ర‌మాలు చేయాల‌ని అంటున్నారు. విజ‌య‌వాడ‌లో ఒక‌ర‌కంగా ప‌రిస్థితి బాగానే ఉంది. నాయ‌కులు ఎక్క‌డా పార్టీ మారిన ప‌రిస్థితి లేదు. కానీ, టీడీపీ దూకుడు ముందు వైసీపీ నేత‌లు నిల‌వ‌లేక పోతున్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌ ఎంతోమంది కీల‌క నాయ‌కులు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు కంచుకోటల్లోనూ పార్టీ కార్య‌క‌ర్త‌లు నామినేష‌న్లు వేయ‌లేని ప‌రిస్థితి.. మ‌నోధైర్యం కోల్పోవ‌డం లాంటి ప‌రిణామాల‌తో కేడ‌ర్ చాలా చోట్ల డీలా ప‌డిపోతోంది. ఈ ప‌రిణామాల‌తో నెల్లూరు, గుంటూరు, విజ‌య‌వాడ‌, ఉమ్మ‌డి గోదావ‌రి వంటి కోస్ట‌ల్ ఏరియా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ జీరో నుంచి మ‌ళ్లీ పార్టీని పైకి లేపుకోవాల్సిన ప‌రిస్థితి.