ఎస్ఈసీ చంద్రబాబుకు సపోర్ట్ చేసే తీవ్రవాది: జగన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు సపోర్ట్ చేయడంలో కరుడుగట్టిన తీవ్రవాదిలాంటి పునేఠా ఏపీ ఎస్ఈసీగా ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎన్నికలు జరుగవని జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఈయనను ఏరికోరి తెచ్చుకున్నారని, చంద్రబాబుపై తీవ్రవాద స్థాయి అభిమానం ఉన్న పునేఠా వంటి వ్యక్తితో జరిగే ఎన్నికలు ఏ విధంగా న్యాయబద్ధంగా జరుగుతాయి అని ప్రశ్నించారు.

2019 ఎన్నికలకు ముందు ఏపీ సీఎస్ గా పునేఠాను చంద్రబాబు పెట్టుకున్నారని, ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినా పునేఠా వినలేదని ఆరోపించారు. ఆ ముగ్గురిలో ఒక పోలీసు అధికారి ఏబీవీని వెనక్కి పిలిపించుకున్నారని ఆరోపణలు చేశారు. అలా చేయడం సరికాదని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టిందని, కానీ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సవాల్ చేస్తూ అప్పుడు సీఎం అయిన చంద్రబాబు కోర్టుకు పోయాడని గుర్తు చేశారు. అయితే, కోర్టు ఒప్పుకోకపోవడంతో చివరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని అన్నారు.

కానీ, టీడీపీకీ అత్యంత అనుకూల, సానుభూతి పరుడు నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో తాము పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లామని జగన్ గుర్తు చేశారు. చిత్తూరు, విశాఖ కమిషనర్..తిరుపతి ఎస్పీ, మాచర్ల సీఐ ట్రాన్స్ ఫర్… ఎంపీడీవోల మాస్ ట్రాన్స్ ఫర్స్….ఇవన్నీ నిమ్మగడ్డ హయాంలో జరిగాయని అన్నారు. అయినా సరే….అటువంటి వాతావరణంలో కూడా వైసీపీ 13 మున్సిపల్ కార్పొరేషన్లు స్వీప్ చేసిందని, 85 శాతం డివిజన్లు..98 శాతం మున్సిపాలిటీలు…81 శాతం వార్డులు గెలుచుకుందని అన్నారు.

ఒక టెంట్ హౌస్ నుంచి మరో టెంట్ హౌస్ కు సామాన్లు సప్లై చేసిన మాదిరిగా… తన మిత్ర పక్ష పార్టీలకు చంద్రబాబు తన పార్టీ నుంచి అభ్యర్థులను పంపారని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు ధైర్యం సరిపోలేదని, నిష్పక్షపాతంగా ఫ్రీ, ఫెయిర్ గా ఎన్నికలు జరిగితే గెలుస్తామన్న నమ్మకం లేదని విమర్శించారు. అందుకే, స్టేట్ స్పాన్సర్డ్ హింసకు ఆయన పాల్పడుతున్నారని, కొందరు అధికారులను చంద్రబాబు నిరంతరంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఒక సిండికేట్, మాఫియా ను తయారు చేశారని, డీఐజీ, డీఎస్పీ, సీఐలు…వారంతా ఎమ్మెల్యేలతో కలిసి..ఇసుక, మైనింగ్, లిక్కర్ దాదా మాఫియా, సిండికేట్ నడుపుతున్నారని ఆరోపించారు.

ఆ సిండికేట్ లో చిన్నబాబు, పెద్దబాబు, ఎమ్మెల్యే, పోలీసుకు ఇంత అని డిసైడ్ చేసుకుంటున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇలాంటి పోలీసులను రెండేళ్లు దాటినా ట్రాన్స్ ఫర్ చేయకుండా వారినే కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుపుతున్నారని ఆరోపించారు. అయితే, వైసీపీ హయాంలో కూడా జగన్ తనకు అనుకూల పోలీసులు, ఇతర అధికారులను ఇలాగే కొనసాగించారని మరిచినట్లున్నారు.