ప్రభుత్వమే తెచ్చిన డేటింగ్ యాప్ కానీ…

యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను ఒకరికొకరు పరిచయం చేసేందుకు ప్రత్యేకంగా డేటింగ్ యాప్ తీసుకొచ్చింది. దీని పేరు ‘ఫస్ట్‌డేట్’ (FirstDate). అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉపయోగించుకునేలా రూపొందించారు. దేశంలో పుట్టే పిల్లల సంఖ్య భారీగా తగ్గిపోతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సింగపూర్‌లో 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ సేవను ప్రారంభించారు. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఇందులో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారికి ఎలాంటి అభిరుచులు ఉన్నాయి, ఖాళీ సమయంలో ఏం చేస్తారు, జీవితంలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తారనే వివరాలను యాప్ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఒకరికొకరు సరిపోయే ఇద్దరిని పరిచయం చేస్తుంది.

ఇందుకోసం ప్రత్యేకమైన కంప్యూటర్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇద్దరి అభిరుచులు, ఇష్టాలు ఎంతవరకు కలుస్తాయో లెక్కించి జంటలను సెలక్ట్ చేస్తుంది. ఈ విధానాన్ని గేల్ షాప్లీ అల్గారిథమ్ అంటారు. యాప్‌లో నమోదు చేసుకునేవారు సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ ఐడీ ద్వారా తమ గుర్తింపును నిర్ధారించుకోవాలి. ఒకేసారి చాలామందిని పరిచయం చేయకుండా ఒక్కొక్కరితో మాత్రమే మాట్లాడే అవకాశం కల్పిస్తారు.

అయితే ఈ యాప్‌ను కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే 35 ఏళ్లు దాటినవారికి అవకాశం లేకపోవడాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ప్రయత్నానికి ఎలాంటి స్పందన వస్తుందో చూసిన తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సింగపూర్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేయడానికి ప్రధాన కారణం అక్కడ తగ్గుతున్న జననాల సంఖ్య. 2025లో దేశంలో పుట్టిన పిల్లల సంఖ్య 30 వేల కంటే తక్కువగా నమోదైంది. దాదాపు 60 ఏళ్లలో ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే మొదటిసారి.