పులివెందులలో ఫైరింగ్… హై టెన్షన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. పులివెందులలో పోలీసులపైకి వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు గాల్లోకి 6 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులపైకి వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి ఫైర్ చేయాల్సి వచ్చింది.

అయితే, వైసీపీ అభ్య‌ర్థుల్ని నామినేష‌న్లు వేయ‌కుండా పోలీసులు అడ్డుకున్నారని, త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులే త‌మ‌ను అడ్డుకోవ‌డం ఏంటని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. రౌడీ మూక‌ల‌కు పోలీసులకు అండ‌గా నిలిచార‌ని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఎదురుతిరగాల్సి వచ్చిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇక, తిరుపతిలో పోలీసుల సమక్షంలోనే వైసీపీ ఎంపీ గురుమూర్తి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు లాక్కెళ్లారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

పల్నాడు జిల్లాలొని దాచేపల్లి పట్టణంలో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కడపలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్లతో, క‌త్తుల‌తో దాడి పరస్పర దాడులు జరిగాయని తెలుస్తోంది. ఈ ఘటనలో వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ తనయుడికి కత్తిపోట్లు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఎస్ఈసీ పునేఠాను వైసీపీ నేతలు కలిసి శాంతి భద్రతలు కాపాడాలని వినతి పత్రం ఇచ్చారు. పలు ఘటనలపై వారు ఫిర్యాదు చేశారు. ఇక, ఈ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను ఇవ్వలేమని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.