ఢిల్లీలో నిరసనలు చేపట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా చూసేలా.. నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద నిరసనలు చేపట్టాలని.. తిరంగా యాత్ర చేపట్టాలని ప్లాన్ చేశారు. అయితే.. దీనిని పోలీసులు పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి.. జల ఫిరంగులను సైతం రెడీ చేయడంతో పాటు విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులను కూడా రాకుండా అడ్డుకున్నారు.
దీంతో నిరసన వ్యవహారంపై అభిజిత్ దీప్కే మరో నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం లేదా సోమవారం.. ఆయన ఢిల్లీ వేదికగా నిరసనను తీవ్రతరం చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిని పసిగట్టిన పోలీసులు తాజాగా శుక్రవారం సాయంత్రం ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు రారాదని, నిరసనలు, ర్యాలీలు చేపట్టరాదని దీనిలో పేర్కొన్నారు. దీంతో దీప్కే పోలీసులపై విరుచుకుపడ్డారు. తిరంగా యాత్రకు అనుమతి లేదన్న పోలీసులపై ఆయన నిప్పులు చెరిగారు. తానేం తప్పు చేశానని ప్రశ్నించారు.
రెచ్చగొట్టేలా మాట్లాడానా? విధ్వంసాలకు ప్రణాళిక వేశానా? అల్లర్లు సృష్టించానా? అంటూ దీప్కే ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు మౌనం వహించారు. ఈ క్రమంలోనే తనకు నోటీసులు ఇవ్వడం కాదని.. తను తప్పు చేసి ఉంటే ఉరేయాలని దీప్కే డిమాండ్ చేశారు. తనను నిలువరించి.. ఉద్యమాన్ని నిలుపుదల చేయలేరని వ్యాఖ్యానించారు. తెల్లకాయితంపై ఏదో ఒకటి రాసుకొచ్చి తనను నిలువరించడం దారుణమని.. ఇలా చేయడం కంటే ఉరేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకున్నారు.
ఇక, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ.. జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ కీలక సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగానే తిరంగా యాత్రకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. కానీ, ఈ యాత్రపై పోలీసులు నిర్బంధాలు విధించారని అందుకే చేపట్టలేక పోయామని దీప్కే వ్యాఖ్యానించారు. ఉద్యమం కొనసాగుతుందని.. అయితే కొంత ఆలస్యం కావొచ్చని ఆయన అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్పార్టీ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates