జర్నలిస్టులను ఉద్దేశించి.. సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో అందరూ జర్నలిస్టులా? అని ప్రశ్నించింది. అలా కుదరదని.. దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని, ఉంటాయని పేర్కొంది. అందరూ జర్నలిస్టులు అయిపోతే.. సమస్యలు వస్తాయని.. ప్రతి ఒక్కరూ మైకు పట్టుకుని.. రోడ్డెక్కితే ఎలా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. పౌరులంతా జర్నలిస్టులుగా మారితే సమస్యలు వస్తాయని అన్నారు.
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంభిస్తోందో తెలుసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. అనంతరం.. తాము మార్గదర్శకాలు ఇస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధివిధానాలు.. జర్నలిస్టులకు ఉండాల్సిన అర్హతలపైనా విచారణ చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు అయిపోతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి సందర్భాలు సరికాదని తెలిపింది.
అసలేం జరిగింది?
ఇటీవల కాలంలో ఢిల్లీలో నిరసన జోరు పెరిగింది. గత రెండు మాసాల కిందట నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఇక, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, అలానే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ.. యువత నిరసనలకు దిగారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జర్నలిస్టులు ఆయా నిరసలను కవర్ చేసేందుకు వచ్చారు. అయితే.. పోలీసులు జరిపిన లాఠీచార్జిలో చాలా మంది యువత గాయపడ్డారు. వీరిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు.
ఈ వ్యవహారంపై జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ నిరసనలను కవర్ చేసేందుకు వచ్చిన రీల్ మేకర్స్, ఫ్రీలాన్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులను పోలీసులు లెక్కచేయలేదని, వారికి కూడా రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. అందరూ జర్నలిస్టులు అయితే సమస్యలు వస్తాయని వ్యాఖ్యానించడంతోపాటు.. అందరికీ ప్రత్యేక భద్రత కల్పించాలా? అని ప్రశ్నించడం గమనార్హం. అసలు జర్నలిస్టులకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates