ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడు(శుక్రవారం) ప్రారంభంకానుంది. ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100 పట్టణ స్థానిక సంస్థలలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. వీటిలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ ప్రక్రియ కేవలం రెండు రోజులు మాత్రమే సాగనుంది. 18వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
అనంతరం.. 19న నామినేషన్లను పరిశీలిస్తారు. 21న మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతుంది. ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. అనంతరం ఈ నెల 30న ఓట్ల లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక, ఈసారి ఎన్నికల్లో మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లను ప్రజలు నేరుగా (ప్రత్యక్ష పద్ధతిలో) ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించనున్నారు. కోర్టు కేసులు, ఇతర న్యాయపరమైన వివాదాల కారణంగా రాష్ట్రంలోని మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు (4 కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు) ఎన్నికలను వాయిదా వేశారు.
వైసీపీనే ముందు..
తాజాగా ప్రారంభంకానున్న నామినేషన్ల ప్రక్రియలో వైసీపీ నేతలే తొలుత నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే తొలిదశ పోరుకు సంబంధించి వైసీపీ అధిష్టానం నాయకులను ఎంపిక చేసింది. దీంతో అభ్యర్థులు తొలి రెండు రోజుల్లోనే నామినేషన్లను పూర్తి చేసేలా ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. కూటమి పార్టీల నేతల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. ముందుగానే ఈ ప్రక్రియలో వైసీపీ పాల్గొననుందని నాయకులు చెబుతున్నారు.
కూటమిలో లేటు..
కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులు తొలిదశ నామినేషన్లను ఒకింత ఆలస్యంగానే దాఖలు చేయనున్నట్టు తెలు స్తోంది. ఇప్పటికి సీట్ల కేటాయింపు జరిగినా.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. ఈ పేర్లు ఖరారు కావడంతోపాటు స్థానికంగా తలెత్తే ఇబ్బందులను, రెబల్స్ను కూడా అంచనావేసుకుని ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ విషయంలో కూటమి ఒకింత ఆలస్యంగానే అడుగులు వేయనుందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates