ఏపీలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీస్‌కు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు.

ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 19,20 తేదీల్లో నామినేషన్ల పరిశీలన చేపడతారు. అక్టోబర్ 21తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అక్టోబర్ 28న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 30న ఫలితాలు వెలువడతాయి.

ఇక, ఈ నెల 19న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 27 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 5న ఫలితాలు ప్రకటించనున్నారు.

ఇక, రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న తొలి దశ, 18న రెండో దశ, నవంబర్ 19న మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. నవంబరు 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడతాయి.