రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే చర్చ కామన్. ఈ విషయంపై అనేక సర్వేలు వస్తున్నాయి. ఆగస్టు చివరి వారంలో వెల్లడైన ప్రతిష్టాత్మక ఇండియా టుడే – సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మళ్లీ భారీ ఆధిక్యంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టమైంది. అలాగే.. మరికొన్ని కూడా ఇదే విషయాన్ని చెప్పాయి.
తాజా పొలిటికల్ సర్వేల ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే అంచనా తిరుగులేని కూటమి హవాను స్పష్టం చేసింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రాతిపదికన చూస్తే, ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో కూటమి 20 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. అదేసమయంలో వైసీపీ కేవలం 5 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేసింది. ఇక, కూటమికి ప్రజల్లో ఆదరణ బలంగానే ఉందని, ఓట్ల శాతంలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కూటమికే స్పష్టమైన మొగ్గు ఉందని తేలింది.
స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అసలు బలం నిరూపించుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో రాకపోయినప్పటికీ, అక్టోబర్ 2026 చివరి నాటికి స్థానిక సంస్థల (మున్సిపల్, సర్పంచ్) ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పట్లో ప్రజా బలం ఎటుందో తెలుసుకోవడానికి ఈ స్థానిక పోరు ఒక సెమీఫైనల్‌గా మారనుంది. జాతీయ సర్వేలు కూటమికే అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్ని స్థానిక సంస్థలు క్షేత్రస్థాయిలో నిరుద్యోగం, రైతు సమస్యల వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని అంచనా వేశాయి.
మొత్తంగా చూస్తే: మెజారిటీ జాతీయ, ప్రముఖ సర్వేల ప్రకారం ( సీ-ఓటర్ సర్వే) ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమిదే మళ్లీ అధికారం అని అర్థమవుతోంది. అయితే క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఎంపికపై అసలు ఫలితాలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఈ సర్వేల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు చంద్రబాబు మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కూటమిదే అధికారమని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates