ఏపీలో మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ అనుకూల మీడియాలో కొద్ది రోజులుగా బ్రేకింగ్ న్యూస్ లు విపరీతంగా బ్రేక్ అవుతున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి తమ వారికి ఉద్యోగాలు వచ్చేలా ఒక ముఠా పని చేసిందని, ఫేక్ ఐడీలతో వేముల రామకృష్ణ అనే వ్యక్తికి ఇంగ్లిష్ టీచర్ జాబ్ వచ్చిందని రాధిక అనే మహిళ వైసీపీ అనుకూల మీడియాలో లైవ్ లో ఆరోపించారు. దీంతో, ఈ వ్యవహారంపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.
అయితే, డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్న రీతిలో ఆ రామకృష్ణ మీడియా ముందుకు వచ్చి అసలు నిజం బయటపెట్టారు. తనకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందని నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధం అని సవాల్ చేశాడు. తాను డీఎస్సీ రాశానని, సరిగ్గా ప్రిపేర్ కాకపోవడంతో తనకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాలేదని తెలిపాడు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే మరో డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నానని వెల్లడించాడు.
తనకు దొడ్డిదారిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం వచ్చిందని రాధిక అనే మహిళ ఆరోపించారని, అది అవాస్తవమని స్పష్టం చేశారు. అదే నిజమని ఆమె నిరూపిస్తే ఉరిశిక్షకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాధికా, ఆమె వెనుకున్నవారు తన సవాల్ ను స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. అంతే కాదు, రాధిక అనే మహిళతో తాను మాట్లాడతానని కోరారు. ఇటువంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికాడు.
దీంతో, డీఎస్సీ స్కాం అంటూ వైసీపీ అండ్ కో చేస్తున్న విష ప్రచారానికి తెరపడినట్లయింది. స్వయంగా ఆ వ్యక్తి వచ్చి నాకు జాబ్ రాలేదు అని చెప్పడంతో వైసీపీ మీడియా ఫేక్ ప్లాన్ బెడిసి కొట్టిందని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇంకా ఎంతమంది రామకృష్ణలు ఉన్నారో…ఎంతమందిపై అసత్య ఆరోపణలు చేశారో అంటూ నెటిజన్లు కూడా వైసీపీని దుమ్మెత్తిపోస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates