టీ షర్ట్ విప్పి హరీశ్ రావు నిరసన

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నల్ల డ్రెస్‌ లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. కానీ, నల్ల దుస్తులతో సభలోకి అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బీఆర్ఎస్ భవన్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుకు నిరసనగా హరీశ్‌ రావు, సుధీర్‌ రెడ్డి, వివేకానందరెడ్డితో పాటు పలువురు నేతలు తమ టీ షర్టులు విప్పేసి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్ ధరిస్తే తప్పు లేనప్పుడు తాము ధరిస్తే తప్పేంటని హరీశ్ రావు ప్రశ్నించారు.

అంతకుముందు, పోలీసుల తోపులాట సందర్భంగా హరీశ్ రావు కిందపడిపోయారు. ఆ సందర్భంగా పోలీసులు హరీశ్ రావు చేతిని తొక్కుతూ అమానుషంగా ప్రవర్తించారని పోలీసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ తోపులాటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కింద పడిపోయారు. ఆయన కాలికి గాయమైంది.