పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల పాటు వాయిదా వేయాల‌ని కోరుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. అందులో ఆయ‌న అనేక విషయాల‌ను ప్ర‌స్తావించారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అనేది అత్యంత కీల‌క విష‌య‌మ‌ని పేర్కొన్నారు. దీనిపై అఖిల ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయాల‌న్నారు.

అదేస‌మ‌యంలో రాష్ట్రాల అభిప్రాయాల‌ను కూడా తీసుకోవాల‌ని.. రాష్ట్రాల‌తోనూ చ‌ర్చించాల‌ని ఖ‌ర్గే కోరారు. అనంత‌రమే.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ప్ర‌తిపాదించిన 33 శాతం రిజ‌ర్వేష‌న్‌ను మాత్రం వ‌చ్చే 2029 ఎన్నిక‌ల నుంచే అమ‌లు చేయాల‌ని ఖ‌ర్గే కోర‌డం గ‌మ‌నార్హం. మ‌హిళా బిల్లు ఇప్ప‌టికే ఆమోదం పొందింద‌ని.. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేష‌న్ కూడా జారీ అయింద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

ఎందుకు?

కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారంపై అనేక ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్‌కు ఓకే చెబుతున్న పార్టీ.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యంలో మాత్రం వెనుకంజ వేస్తోంది. దీంతో ఇలా ఎందుకు చేస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. వ‌చ్చే ఏడాదిలోగా ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను విడ‌దీయ‌డం ద్వారా.. త‌మ ఓటు బ్యాంకుకు న‌ష్టం జ‌రుగుతుంద‌న్న భావ‌న పార్టీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇదే విష‌యంపై ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ అగ్ర‌నేత‌ల స‌మావేశంలోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఏడు రాష్ట్రాలకు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన యూపీ, పంజాబ్ వంటివి కూడా ఉండ‌డం.. ఆయా రాష్ట్రాల్లో జ‌నాభా ప్రాతిప‌దిక‌న కాకుండా.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జ‌న చేస్తే.. మైనారిటీ ఓటు బ్యాంకు గ‌ల్లంత‌వుతుంద‌న్న చ‌ర్చ ఉంది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితిలో ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఈ విష‌యాన్ని దాచిపెడుతున్న కాంగ్రెస్‌.. రాష్ట్రాల అభ్యంత‌రాల‌ను తెర‌మీదికి తెస్తుండ‌డం గ‌మ‌నార్హం.