సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఆరేళ్ల బీహార్ బుడతడు 

బిహార్‌ యువత హక్కుల కోసం గొంతెత్తిన ఆరేళ్ల బాలుడు ఆదిత్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు. విద్యార్థుల ఉద్యోగాలు, ఉపాధి హామీలపై పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడిన ఆదిత్య ముందు ఏకంగా 20కి పైగా మైకులు ఉన్నా.. అతడి ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. ‘‘విద్యార్థులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? సమ్రాట్‌ చౌదరి.. విద్యార్థులకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు?’’ అంటూ బాలుడు ప్రశ్నించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

70వ బీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనల్లో ఆదిత్య పాల్గొన్నట్లు సోషల్‌ మీడియాలో కథనాలు వైరల్‌ అవుతున్నాయి. విద్యార్థుల హక్కుల కోసం నిరసనలో పాల్గొన్న ఈ చిన్నారి.. తన పాఠశాలలో కనీస వసతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపైనా ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ‘‘నేరస్తులను పట్టుకోలేని పోలీసులు.. విద్య, ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థులపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు?’’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

వయసు ఆరేళ్లే అయినా.. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగాలు, ప్రభుత్వ హామీలపై ధైర్యంగా ప్రశ్నలు సంధించిన ఆదిత్య తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్నారి గొంతులో వినిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం.. ఆ గొంతును అణచివేయడం కాదు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలుడిని పోలీసులు అతని తల్లిదండులకు అప్పగించి జాగ్రత్త చెప్పినట్టు తెలుస్తుంది.