ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కార్యకర్తలకు పెద్ద టాస్క్ ఇచ్చారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని పార్టీ నేతలకు సూచించారు. ఏకగ్రీవాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉందన్న నమ్మకం కల్పించాలని, గెలుపోటముల కంటే ముందుగా పోటీకి సిద్ధపడటమే ముఖ్యమని పేర్కొన్నారు.

ఏకగ్రీవాలు జరిగే నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు తదుపరి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని హెచ్చరించారు. ప్రతి ఓటూ కీలకమేనని, బలమైన అభ్యర్థులను ముందుగానే గుర్తించి ఎన్నికల బరిలోకి దించాలని సూచించారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, దౌర్జన్యాలు ఎదురైనా కార్యకర్తలకు అండగా నిలవాలని చెప్పారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా.. వారికి రాజకీయ, న్యాయపరమైన అండ అందించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని ఆయన సూచించారు.

జగన్‌ తాజా దిశానిర్దేశాలను పరిశీలిస్తే.. స్థానిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో వైసీపీని పునర్‌నిర్మించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కొంతకాలంగా రాజకీయంగా స్తబ్దంగా ఉన్న కేడర్‌ను మళ్లీ క్రియాశీలం చేయడం, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, ప్రభుత్వంపై రాజకీయ పోరాటాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడం ఇందులో ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి.

ఏకగ్రీవాలను అడ్డుకోవాలన్న సూచన కూడా ఇందులో భాగమే. అధికార పార్టీ ప్రభావంతో ప్రతిపక్ష అభ్యర్థులు పోటీకి దూరమైతే పార్టీ కేడర్‌ ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే గెలుపు కంటే ముందుగా ప్రతి చోటా పార్టీ అభ్యర్థి పోటీలో ఉండేలా చూడాలని జగన్‌ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే ఆదేశాలతోనే ఇది సాధ్యం కాదు. బలమైన అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గ స్థాయిలో సమన్వయం, కార్యకర్తలకు నిరంతర అండ అవసరం. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు వైసీపీకి కేవలం పరీక్షగా మారనున్నాయి.