మహిళల జోలికి వస్తే ఎవరైనా ఒకటే

గుంటూరులో మహిళపై దాడి చేసి, నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుబంధం లేదా పార్టీ సభ్యత్వం రక్షిస్తుందని ఎవరైనా భావిస్తే అది పెద్ద పొరపాటేనని స్పష్టం చేశారు.

గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఈ నెల 15న ఇంటి ముందు మోటార్‌తో నీరు పట్టుకుంటున్న మహిళతో 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుడిపై దాడి చేసి, మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసినట్లు ఆరోపణలు రావడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై స్పందించిన లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారని వెల్లడించారు. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకుడిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేయాలని తాను ఆదేశించినట్లు తెలిపారు.

మహిళను అవమానించడం అంటే సమాజ విలువలను అవమానించినట్లేనని పేర్కొన్న లోకేష్, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వారిపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, తప్పు చేసిన వారికి రాజకీయ అండ ఉండదని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి కూడా ఘటనపై తీవ్రంగా స్పందించి నిందితుడిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లెల వెంకటరమణమూర్తితో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.