ఉప ప్రధానిగా అమిత్ షా కు ప్రమోషన్?

ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా…ఈ ఇద్దరి జోడీ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. గుజరాత్ సీఎంగా మోదీ, హోం మినిస్టర్ గా అమిత్ షా విజయవంతంగా సుపరిపాలన అందించి గుజరాత్ ను దేశానికి రోల్ మోడల్ గా నిలిపారు. అదే రీతిలో భారత్ ను కూడా ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన నిలిపేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ హై కమాండ్ లో మోదీ తర్వాత నంబర్ 2గా అమిత్ షా అనధికారిక ఉప ప్రధానిగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే మోదీ తర్వాత ప్రధాని స్థానాన్ని భర్తీ చేయబోయే సామర్థ్యం, సత్తా అమిత్ షాకు మాత్రమే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మొదలు బీజేపీ నేతల వరకు అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో అమిత్ షా అధికారికంగా భారత ఉప ప్రధాని కాబోతున్నారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమిత్ షాను ఉప ప్రధానిగా కేంద్ర కేబినెట్ ఆమోదించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

త్వరలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈ క్రమంలోనే కొందరికి ప్రమోషన్, కొందరికి డిమోషన్ తప్పదని టాక్. ఆ క్రమంలోనే అమిత్ షాకు ప్రమోషన్ లాంఛనమే అని ఢిల్లీ వర్గాల్లో జోరుగా టాక్ వస్తోంది. అమిత్ షాను ప్రమోట్ చేయడానికి ఇదే సరైన సమయమని మోదీ భావిస్తున్నారట.