ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. రావణ్ తప్పు చేస్తే… ఆ తప్పులకు సరిపడ సెక్షన్లతోనే కేసులు నమోదు చేయాలి గానీ… కేవలం బూతులు మాట్లాడారంటూ అతడిపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం తగదని ఏబీవీ అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ప్రశ్న రావణ్ కు మద్దతు పలికారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను విశ్లేషించి… వాటికి అనుగుణంగానే ఆయన మాట్లాడారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
విజయవాడలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఏబీవీ…ప్రశ్న రావణ్ అరెస్టు, అతడిపై నమోదు అయిన కేసుల గురించి మాట్లాడారు. అంతేకాకుండా ప్రశ్న రావణ్ కు మద్దతుగా నిలుస్తున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపైనా ఏబీవీ స్పందించారు. ఏలూరు బహిరంగ సభలో ప్రశ్న రావణ్ మాట్లాడిన భాష తప్పేనని ఏబీవీ అన్నారు. బహిరంగ సభల్లో ఫలానా వ్యక్తులను ప్రస్తావిస్తూ బూతులను ప్రయోగించడం రావణ్ కు తగదని ఆయన అన్నారు. అయితే ఆ మాటలన్నందుకు ప్రశ్న రావణ్ పై ఏకంగా ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన అన్నారు.
ఇక ప్రకాశ్ రాజ్, రాధా మోహన్ దాస్ ల విషయాన్ని కూడా ఏబీవీ ప్రస్తావించారు. ఏ ఒక్కరు అయినా రాజ్యాంగానికి లోబడే ప్రవర్తించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయంలో వాక్ స్వాతంత్య్రం పేరిట ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తామంటే కుదరదని కూడా ఆయన అన్నారు. ప్రశ్న రావణ్ కు మద్దతుగా ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా… తాను చెప్పినట్టే ప్రకాశ్ రాజ్ కూడా చెప్పారని ఏబీవీ అన్నారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను ఖండించడానికో లేదంటే వాటిని వెనకేసుకుని రావడానికో తానుసిద్ధంగా లేనని ఆయన అన్నారు.
ఇక ప్రశ్న రావణ్ పై నమోదు చేసిన ఉపా కేసుల పర్యావసానాన్ని ప్రస్తావించిన ఏబీవీ… ఈ తరహా చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని అన్నారు. ఆధునిక ఆంద్రప్రదేశ్ ను తాను కోరుతున్నానని చెప్పిన ఏబీవీ… ప్రభుత్వ చర్చలు చూస్తుంటే… రాష్ట్రం ఆఫ్ఘనిస్థాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు. పాలకులు రాష్ట్రాన్ని ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలి గానీ… ఆఫ్ఘనిస్థాన్ లా మారే దిశగా సాగరాదని ఆయన అన్నారు. ఏ తప్పుకు ఆ శిక్ష మాత్రమే వేయాల్సి ఉందన్న ఏబీవీ… చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు తగవని తేల్చేశారు. ఈ తరహా చర్యలు ఇక ముందు కూడా సాగితే… ప్రభుత్వం ప్రజల నుంచి భారీ నిరసనలను ఎదుర్కోక తప్పదని ఏబీవీ హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates