జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా? ఆమె ఈ దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. బెజ‌వాడ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఈ దిశ‌గా చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే జ‌న‌సేన‌కు చెందిన ఓ కీల‌క ఎమ్మెల్సీతో ఆమె రెండు మార్లు భేటీ అయ్యార‌ని.. రాజ‌కీయంగా త‌న చేరికపై చ‌ర్చించార‌ని విశ్లేష‌కులు సైతం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై జ‌న‌సేన పార్టీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు.

రంగా కుమార్తెగా ఆశాల‌త‌.. గ‌త ఏడాది మీడియా ముందుకు వ‌చ్చారు. తాను ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేందుకు ముందుకు వ‌స్తున్నట్టు ఆమె చెప్పారు. ముఖ్యంగా రంగా ఆశ‌యాల‌ను నిల‌బెట్టేందుకు, స‌మాజంలోని పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల‌కు న్యాయం చేసేందుకు తాను వారిని క‌లుస్తాన‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన రాధా రంగా మిత్ర మండ‌లిని మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. వారి సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుని ముందుకు సాగుతాన‌ని కూడా ఆశ వివ‌రించారు. ఆ త‌ర్వాత మ‌రో రెండు సార్లు మీడియా ముందుకు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇదే మాట చెప్పారు.

అయితే.. రాజ‌కీయంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆమె ఏదో ఒక పార్టీలో చేర‌తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే వైసీపీ నుంచి మాజీ మంత్రి పేర్ని నాని, కుర‌సాల క‌న్న‌బాబు వంటి కాపు నాయ‌కులు ఆశాల‌త‌తో చ‌ర్చించార‌ని కూడా అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ, దీనిపై ఎలాంటి పురోగ‌తీ క‌నిపించ‌లేదు. కాగా.. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌లో చేరేందుకు ఆశాల‌త రెడీగా ఉన్నార‌ని, ఆమె ఈ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన రంగా ఆ వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎద‌గ‌డం అందరికీ తెలిసిన విషయమే.

రంగా కుమారుడు రాధా.. ప్ర‌స్తుతం టీడీపీలో కొన‌సాగుతున్నారు. అయితే.. ఆయ‌న ప‌లు పార్టీలు మారిన విష‌యం తెలిసిందే. పైగా 2004 త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. ప్ర‌స్తుతం టీడీపీలోనూ పెద్ద‌గా యాక్టివ్ రోల్ పోషించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో వంగ‌వీటి ఆశాల‌త‌.. జ‌న‌సేన వైపు చూస్తున్నార‌న్న వార్త‌లు ఆస‌క్తిగా మారాయి. రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు.. ఎప్పుడు ఎవ‌రు ఎక్క‌డ‌నుంచి ఎక్క‌డికైనా ప్ర‌యాణం చేయొచ్చు. సో.. ఈ వార్త‌ల‌ను కూడా తోసిపుచ్చ‌డానికి లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.