ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీలోని అశోకా హోటల్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ కీలక నేతలు హాజరు కానున్నారు.
దాదాపుగా 150 మంది ముఖ్య నేతలు పాలుపంచుకుంటున్న ఈ సమావేశంలో పార్టీ తరఫున వివిధ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా కొనసాగనున్న ఈ సమావేశంలో పార్టీ అదినేత హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేయనున్నారు.
తెలుగు నేల మీద పుట్టిన జనసేన ఆది నుంచి జాతీయ పార్టీ కిందే లెక్క. వివిధ పార్టీలు, ఆయా పార్టీల నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు జనసేనను ఓ ప్రాంతీయ పార్టీగానే పరిగణిస్తున్నా… పార్టీ వైఖరి, ఆ పార్టీ అధిష్ఠానం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, సాగుతున్న తీరు చూస్తే మాత్రం జనసేనను ప్రాంతీయ పార్టీ వరకే పరిమితం చేయలేం.
ఎందుకంటే జాతీయ భావాల విషయంలో జనసేన ఏ ఒక్క పార్టీకి తీసిపోని రీతిలో సాగుతోంది. పార్టీ కేడర్ లోనే కాకుండా ప్రజల్లోనే జాతీయ భావనలు పెంపొందించేలా పార్టీ అధిష్ఠానం కీలక అడుగులు వేస్తున్నసంగతి తెలిసిందే.
ఇటీవలే తెలంగాణ ఆవిర్భావం రోజున హైదరాబాద్ లో జనసేన సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కల్యాణ్ యత్నించగా…తెలంగాణ ప్రభుత్వం ఆ సమావేశాన్ని అడ్డుకున్నసంగతి తెలిసిందే. నాడు తెలంగాణ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన పవన్.. తనతో పాటు జనసేన అవలంభిస్తున్న జాతీయ తత్వాన్ని బలంగా ప్రదర్శించారు.
భారత్ తన మాతృభూమి అన్న పవన్… తన మాతృభూమిలో తెలంగాణ ఓ అంతర్భాగమని, అలాంటి చోట తాను సమావేశం పెడతానంటే అనుమతి ఎందుకు ఇవ్వరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదని, ఏ ఒక్కరి జాగీరు కాదని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ సందర్భంగా పవన్ పైనా తెలంగాణ వాదులు ఓ రేంజిలో విరుచుకుపడిన విషయమూ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే జనసేన దేశ రాజధాని డిల్లీ వేదికగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న తీరు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సమావేశంలో ప్రాంతీయత, జాతీయత అన్న అంశాలపై పవన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రాంతీయ తత్వాన్ని కాపాడుకుంటూనే జాతీయ భావనను పెంపొందించుకునే దిశగా ఏ రీతిన ముందుకు సాగాలన్న విషయంపై పవన్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వెరసి ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
