మోడీపై ట్రంప్ పొగ‌డ్త‌ల వ‌ర్షం… కొత్తగా మళ్ళీ ఏంటి?

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఏ క్ష‌ణాన ఎలా ఉంటారో తెలియ‌దు. ఒక్క‌క్ష‌ణంలోనే ఆయ‌న మ‌న‌సు మార్చుకున్న సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఒక‌రిని పొగిడినా.. మ‌రొక‌రిని తెగ‌డినా.. ట్రంప్ స్ట‌యిల్ చాలా భిన్నంగా ఉంటుంది. అమెరికా మెప్పుకోస‌మే తాను ప‌నిచేస్తున్నాన‌ని నిర్మొహ‌మాటంగా చెప్పుకొనే ట్రంప్‌.. నిజంగానే ఆయ‌న ఆప‌నే చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఏడాది కాలంలో ట్రంప్ గ్రాఫ్‌ను ప‌రిశీలిస్తే.. ఇదే క‌నిపిస్తుంది.

అమెరికా ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా.. ఆయన వ్య‌వ‌హరిస్తున్నారు. అమెరికా ల‌బ్ధి కోసం.. లేదా.. త‌న మాట నెగ్గించుకోవ‌డం కోసం.. ట్రంప్ అనేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాజాగా ఇరాన్‌-అమెరికాల మ‌ధ్య యుద్ధం కూడా పంతం కోస‌మేన‌న్న విష‌యం తెలిసిందే. సుంకాల కొర‌డా ప‌ట్టుకుని ఒక‌వైపు.. చెలిమి అంటూ మ‌రోవైపు మాట్లాడే ట్రంప్ వ్య‌వ‌హార శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. తాజాగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గొప్ప నాయ‌కుడ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు.

ఆయ‌న‌కు త‌మ స‌హ‌కారం ఎల్ల‌ప్పుడూ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో డొనాల్డ్ ట్రంప్ ఫోన్ ద్వారా ప్ర‌సంగించారు. తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్ర‌స్తావించారు. భారత్-అమెరికా సంబంధాలు గతంలో కంటే మరింత బలపడ్డాయని అన్నారు.

భారతదేశంపై తనకు అపార‌మైన అభిమానం ఉంద‌న్నారు. ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ త‌న‌కు ఆప్త‌మిత్రుడని తెలిపారు. భారతదేశాన్ని తాను ప్రేమిస్తున్నాన‌ని, ప్రధాని మోడీ గొప్పవారని పేర్కొన్నారు. అయితే.. ఈ పొగ‌డ్త‌లు ఎందుకు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. గ‌తంలో పాకిస్తాన్‌-భార‌త్ మ‌ధ్య యుద్ధాన్ని(ఇది దాడి మాత్ర‌మే) తానే నిలువ‌రించాన‌ని చెప్పారు. భార‌త్ త‌న మాట విన‌కుండా.. సుంకాల‌ను 200 శాతం చేస్తాన‌న్నారు. మోడీని కూడా ప‌లు సంద‌ర్భాల్లో ఇరుకున పెట్టారు. కానీ, ఇప్పుడు వ్యూహాత్మ‌కంగా మోడీపైనా.. భార‌త్‌పైనా ప్రేమ కురిపించారు.

కార‌ణాలుఏంటి?

1) ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో అమెరికా నుంచి భారీ ఎత్తున చ‌మురును కొనాల‌న్న‌ది ట్రంప్ ప్ర‌తిపాద‌న‌.

2) భార‌త్‌తో వాణిజ్యం పెంచుకోవాల‌న్న‌ది ప్ర‌ధాన వ్యూహం. అయితే.. దీనిలో అమెరికా నుంచి భార‌త్ కొనేది ఎక్కువ‌గా ఉండాలి.(80 శాతం), అమెరికా మాత్రం భార‌త్ నుంచి కొనేది 20 శాతం. ఈ ప్రాతిప‌దిక‌పై ఇప్ప‌టికే చ‌ర్చ‌లు ముగిశాయి. దీనికి ప్ర‌ధాని మోడీ త‌లూపిన‌ట్టు స‌మాచారం. అందుకే ఎక్క‌డా లేని ప్రేమ‌ను ట్రంప్ కురిపించేశార‌ని జాతీయ మీడియా స‌హా.. ప్ర‌పంచ మీడియా కూడా చెబుతోంది.