స్టాలిన్ పతనానికి కొడుకే కారణమా?

అది మార్చి.. ఎన్నిక‌ల‌కు 50 రోజుల‌కు పైగానే స‌మ‌యం ఉంది. స‌ర్వేల సంస్థ‌లు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నాయి. మీకు ఏ సీఎం కావాలి? అంటూ.. మూడు ఆప్ష‌న్ల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచాయి. వీటిలో స్టాలిన్‌, ప‌ళ‌ని స్వామి, విజ‌య్ ఉన్నారు. అయితే.. ప్ర‌జ‌లు స్టాలిన్‌నే కొరుకున్నారు. దాదాపు 42 శాతం మంది ప్ర‌జ‌లు ఇలా స్టాలిన్‌కే స‌ర్వేల్లో ఓటేశారు. ఇక‌, ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం.. క‌లిసి వ‌చ్చిన సెగ్మెంట్‌.. కొళ‌త్తూరులో అయితే.. స్టాలిన్ ఫొటోల‌కు ఎన్నిక‌ల‌కు ముందు పాలాభిషేకాలు కూడా చేశారు.

కానీ.. ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చేస‌రికి స్టాలిన్ మంచి సీఎం అని కొనియాడిన వారే.. మ‌రోసారి స్టాలిన్‌బాబును సీఎంగా చూడాల‌ని చెప్పిన వారే యూట‌ర్న్ తీసుకున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏంటి? ఎందుకు? ఇలా జ‌రిగింది? అంటే.. వార‌స‌త్వ రాజ‌కీయ‌మే కార‌ణం. వాస్త‌వానికి డీఎంకే అంటేనే.. వార‌స‌త్వ రాజ‌కీయం. క‌రుణానిధి నుంచి స్టాలిన్ డీఎంకే ప‌గ్గాలు చేప‌ట్టారు. ఇక‌, స్టాలిన్ నుంచి ఆయ‌న వార‌సుడు ఉద‌య‌నిధి ప‌గ్గాలు చేప‌ట్ట‌డం ఖాయ‌మే.

కానీ.. ప్ర‌జ‌లు ఈ విష‌యంలో యూట‌ర్న్ తీసుకున్నారు. స్టాలిన్ పార్టీ గెలిస్తే.. ఆయ‌న కుమారుడిని సీఎం చేయ‌డం ఖాయం అంటూ.. బీజేపీ చేసిన ప్ర‌చారం దూసుకుపోయింది. ఒక్క బీజేపీనే కాదు.. అన్నాడీఎంకే స‌హా.. స్టాలిన్ సోద‌రుడు.. క‌రుణానిధి పెద్ద కుమారుడు అళ‌గిరి చేసిన ప్ర‌చారం కూడా ద‌క్షిణ త‌మిళ‌నాడు ప్రాంతంలో తీవ్రంగా ప్ర‌భావం చూపించింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు స్టాలిన్‌కు అనుకూలంగా ఉన్న‌వారు కూడా యూట‌ర్న్ తీసుకున్నారు.

ఉద‌య నిధిపై..

ఇప్పుడు కాక‌పోతే.. రేపైనా డీఎంకే ప‌గ్గాలు చేప‌ట్టాల్సింది ఉద‌య‌నిధే. ఈ విష‌యం త‌మిళుల‌కు తెలియంది కాదు. కానీ, ఇప్ప‌టికిప్పుడు ఉద‌య‌నిధిని వారు ముఖ్య‌మంత్రిగానే కాదు.. మంత్రిగా కూడా చూడాలని భావించ‌లేదు. ఇదే మొత్తానికి డీఎంకే పుట్టిముంచింది. డిప్యూటీ సీఎంగా ఉన్న ఉద‌య‌నిధి.. అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. హిందూత్వంపై ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు దేశ‌వ్యాప్తంగా ర‌చ్చ‌రేపాయి.

అలాగ‌ని ద‌ళితుల‌ను అక్కున చేర్చుకున్నాడా? అంటే.. వారు రిజ‌ర్వేష‌న్ల‌తో లావ‌వుతున్నారు అంటూ.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కేవ‌లం ద్రవిడుల‌కు మాత్ర‌మే ఉద్యోగాలు ఇవ్వాల‌న్న పిలుపునిచ్చారు. ఇవ‌న్నీ ఉద‌య‌నిధి రాజ‌కీయాల‌పై మ‌చ్చ‌లువేశాయి. అయితే.. చిత్రంగా చెపాక్ నుంచి ఆయ‌న విజ‌యం ద‌క్కించుకోగా.. స్టాలిన్ ప‌రాజ‌యం పాల‌య్యారు.