వెక్కివెక్కి ఏడ్చిన బొత్స

వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు. ఇలా బహిరంగంగా బొత్స ఏడ్చింది.. ఏదో పార్టీ సమావేశంలో కాదు. మీడియా ముందు ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఈ మేరకు విశాఖలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుని బొత్స కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని… ఈ విషయాన్ని వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణనే చెప్పారంటూ టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించేందుకు వెనువెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన బొత్స… వైఎస్ మరణం, నాడు చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ తో తనకున్న అనుబంధం అలాంటిది అని వ్యాఖ్యానించిన బొత్స…కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్ చనిపోయిన సందర్భంలో జగన్ ఏపీలో లేరని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని అచ్చెన్న చెప్పిన మాటల్లో వాస్తవం లేదని బొత్స అన్నారు. నాడు సీఎం క్యాంపు ఆఫీస్ లో నుంచి జగన్ ను తాను, తన భార్చ ఝాన్సీ చెరో పక్క పట్టుకుని తీసుకుని వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగానే భావోద్వేగానికి గురైన బొత్స కన్నీటిపర్యంతం అయ్యారు. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడానికి తాను సిద్ధమేనని, అయితే దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. అచ్చెన్న అహంకారంతో మాట్లాడుతున్నారన్న బొత్స… కూటమి నేతలు అహంకారాన్ని వీడాలని హితవు పలికారు.