ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. తమిళ వెట్రి కళ‌గం(టీవీకే) పార్టీని పెట్టుకున్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలో దిగారు. అయితే రాష్ట్రంలో ప్రధానంగా రెండు కూటములు ఎన్నికల్లో తలపడుతున్నాయి. అధికార డిఎంకె పార్టీ నేతృత్వంలోని ఒక కూటమి, ప్రతిపక్షం అన్న డీఎంకే నేతృత్వంలోని మరోకూటమి గట్టిగా పోరు సాగిస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం ఒంటరిగా తన సత్తాను చాటే ఎందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా రాష్ట్రంలో జరిగిన అనేక సర్వేలు విజయ్ ఇలా ఒంటరి పోరు చేయడానికి గల కారణాలపై పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. అటు అధికార పార్టీ డిఎంకె వ్యతిరేక ఓటును, ఇటు సామాజిక వర్గాలపరంగా క్రైస్తవుల ఓటును చీల్చే ప్రయత్నంలో విజయ్ ఉన్నారన్నది సర్వేలు చెబుతున్న మాట. ప్రస్తుతం డిఎంకె ప్రభుత్వంపై ఉద్యోగులు అదేవిధంగా యువత, మహిళలు ఒకంత ఆగ్రహంతో ఉన్నారు. ఇక మరో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కూట‌మిపై కూడా తటస్థ ఓట‌ర్లు వ్యతిరేకంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. వీరంతా ఏకమై టీవీకేకు ఓటేస్తే విజయ్ కి అది కీలకంగా మారుతుంది అన్నది సర్వేలు చెబుతున్న మాట.

అయితే ఆయన నేరుగా అధికారంలోకి రాకపోయినప్పటికీ అధికారంలోకి రావాలని భావిస్తున్న డిఎంకె, అన్నాడీఎంకేలకు విజయ్ కీలకంగా మారే పరిస్థితి ఉందని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం విజయ్ కు ఉన్న ఓటు బ్యాంకుపై జరిగిన సర్వేలో దాదాపు 18 నుంచి 20 శాతం మేరకు ఓటు బ్యాంకు విజయ్‌కు అనుకూలంగా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పటికీ రేపు `కింగ్ మేకర్ `గా మారతారు అన్నది సర్వేలు పేర్కొంటున్నాయి. ఏ పార్టీతోను పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లడానికి వ్యూహాత్మక కారణం కూడా ఇదేనన్నది సర్వేలు అంచనా వేస్తున్నాయి.

జన్మతః క్రిస్టియన్ అయిన విజయ్.. ఆ వర్గం ఓట్ల‌ను సాధించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు ఎవరు రాజకీయాల్లో బలమైన పోటీ ఇవ్వలేకపోవడం విజయ్ కు కలిసివస్తోంది. దీంతో ఆ వర్గం ఓట్లు విజయ్‌కు అనుకూలంగా మారతాయి అన్నది సర్వేలు అంచ‌నా వేస్తున్నాయి. అదేవిధంగా యువత, ప్రభుత్వ ఉద్యోగులు విజయ్‌కు సానుకూలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

తద్వారా ఓట్లను చీలిస్తే విజయ్ `కింగ్ మేకర్` గా మారతారని, నేరుగా ఆయన అధికారంలోకి రాకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చే పార్టీలకు ఆయన మద్దతు లేకుండా సాధ్యం కాదన్నది సర్వేలు అంచనా వేస్తున్నాయి, అంటే ఒంటరి పోరాటం చేయడం వెనక విజయ రహస్యం ఇదేనన్నది సర్వేలు చెబుతున్న మాట, మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.