నిజమైన సైనికుడి తల్లిదండ్రుల కోరికను మన్నించాలి పవన్

మన జనాలకు సినిమా హీరోలు గుర్తున్నంతగా.. దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికులు గుర్తుండరు అన్నది కఠిన వాస్తవం. కొన్నేళ్ల ముందు గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్.. గత ఏడాది పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ లాంటి రియల్ హీరోల గురించి ఎంతమందికి తెలుసు అన్నది ప్రశ్నార్థకం.

ప్రాణాలకు భరోసా లేదని తెలిసి కూడా సైన్యంలో చేరి సరిహద్దుల్లో పహరా కాసే.. దేశ వ్యతిరేక శక్తులతో పోరాడే వీరుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్దగా జీవితం చూడకుండానే సైన్యంలో చేరి.. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎంత రోదించి ఉంటారో.. ఇప్పటికీ ఎంత బాధను అనుభవిస్తుంటారో మాటల్లో చెప్పడం కష్టం. నిరుడు పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో తెలుగు వాడైన మురళీ నాయక్ కూడా ఉన్నాడు. చనిపోయే సమయానికి అతడి వయసు కేవలం 25 ఏళ్లు.

మురళీ నాయక్ మృతి చెంది ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏప్రిల్ 14న కుటుంబ సభ్యులు వైకుంఠ సమారాధన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మురళి తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఒక విజ్ఞప్తి చేశారు.

పవన్ కళ్యాణ్ అంటే తమ కుమారుడికి ఎంతో ఇష్టమని.. వైకుంఠ సమారాధానకు ఆయన హాజరై మురళికి నివాళి అర్పించాలని కోరుకుంటున్నామని చెప్పారు. సైన్యంలో చేరడం ఎందుకు అని తాము వారించినా తమ బిడ్డ వినలేదని.. ఒక్కసారి అయినా సైనికుడి దుస్తులు ధరించాలని అన్నాడని.. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని చెప్పాడని.. సైన్యంలో ఉండి జనిపోతే దేశవ్యాప్తంగా అందరూ హీరోలా చూస్తారని.. మన దగ్గరికి వస్తారని చెప్పాడని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు.

మురళికి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ వచ్చి నివాళి అర్పిస్తే తమ బిడ్డ ఆత్మ శాంతిస్తుందని.. ఆయన్ని ఎలా కలవాలో తెలియక, ఇలా వీడియో చేస్తున్నామని.. దీన్ని ఆయనకు చేర్చాలని కోరారు శ్రీరామ్, జ్యోతి. మరి ఈ వీడియో పవన్ వరకు వెళ్తుందా.. ఆయన స్పందించి మురళికి నివాళి అర్పిస్తాడా అన్నది చూడాలి.