రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. తొలుత 25 శాతం మేర టారిఫ్‌లు విధించగా, అనంతరం రష్యా చమురు కొనుగోలుతో సంబంధం ఉన్న పెనాల్టీ టారిఫ్‌లను కూడా జోడించి వివిధ రంగాల్లో ఆందోళనకు దారి తీసింది. రష్యా చమురు కొనుగోలును తగ్గించకపోతే టారిఫ్‌లపై సడలింపు ఉండదన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారు.
ఇప్పుడు రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తూ, అమెరికా తో పాటు వెనుజువేలా వంటి ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు పెంచేందుకు ప్రధాని మోదీ అంగీకరించినట్టు ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిఫలంగా భారత్‌పై ఉన్న మొత్తం టారిఫ్‌లను 25 శాతం స్థాయి నుంచి 18 శాతం వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.
ఇది వాణిజ్య రంగానికి కొంత ఉపశమనాన్ని ఇవ్వగల అంశమే అయినా, మరోవైపు అతి తక్కువ ధరలకు, భారీ డిస్కౌంట్లతో లభిస్తున్న రష్యా చమురు కొనుగోలు ఆపడం వల్ల ఎదురయ్యే ప్రభావాలు తీవ్రంగా ఉండొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అదెలాగో చూద్దాం.
గత కొన్ని సంవత్సరాలుగా భారత్ తన చమురు అవసరాల్లో అధిక వాటాను రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం రష్యా చమురు తక్కువ ధరకు, డిస్కౌంట్లతో లభించడమే. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగినా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉండగలిగాయి.
ఇప్పుడు రష్యా చమురు దిగుమతులు తగ్గించి, అమెరికా లేదా ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తే, ఆ భారమంతా నేరుగా రిఫైనర్లపై పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్ప వారికి వేరే మార్గం మిగలకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే భారత్ రష్యా చమురును పూర్తిగా నిలిపివేస్తుందన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. ఇది పూర్తిగా మార్కెట్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ సరఫరా ఒప్పందాలు, అలాగే ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్ ఎలాంటి వ్యూహం రచిస్తుందో చూడాల్సి ఉంది.
ఒకవేళ అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా రష్యా చమురు కొనుగోలు భారీగా తగ్గితే, దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల్లో కనిపించే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates