కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి అంద‌రూ ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో(నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి).. ఖ‌చ్చితంగా ఆయా రాష్ట్రాల‌కు మేలు చేసేలా కేంద్ర బ‌డ్జ‌ట్‌ను వండి వారుస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ.. అనూహ్యంగా ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవు. అంటే.. ప్ర‌త్య‌కంగా ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై ప్రేమ కురిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి గ‌త ఏడాది బీహార్ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టులు ఇచ్చారు.

ఇక‌, బ‌డ్జ‌ట్ స్వ‌రూపాన్ని గ‌మ‌నిస్తే.. నిరుద్యోగ భార‌తాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నాలు క‌నిపిస్తున్నాయి. చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య త‌రహా (ఎం.ఎస్.ఎం.ఈ) ప‌రిశ్ర‌మ‌లకు ఊతం ఇచ్చేందుకు ప్రత్యేక ప‌థ‌కాలు తీసుకువ‌స్తున్నారు. అదేవిధంగా ప్ర‌పంచ స్థాయి ప‌రిణామాల ప్ర‌భావం ఈ బ‌డ్జ‌ట్‌పై బ‌లంగా క‌నిపించింది. ప్రస్తుతం ప్ర‌పంచ దేశాలు చాలా వ‌ర‌కు సంక్షోభంలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌ను ప‌ట్టు త‌ప్ప‌కుండా చూసే ప్ర‌క్రియ కొన‌సాగింది. ఈ క్ర‌మంలోనే 6 ముఖ్య రంగాల్లో సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది.

ఇదే స‌మ‌యంలో ఔష‌ధ‌రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా బ‌యో ఫార్మాను బ‌లోపేతం చేసేందుకు.. 10 వేల కోట్ల రూపాయ‌ల‌తో(5 ఏళ్ల‌కు).. `శ‌క్తి` ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఇక‌, ఫార్మా ఎడ్యుకేష‌న్‌, ప‌రిశోధ‌న‌కు ప్రాధాన్యం పెంచ‌నున్నారు. ఇక‌, సెమీ కండక్ట‌ర్ రంగంలో వృద్ధిని ఆశిస్తున్నారు. ఈ క్ర‌మంలో సెమీకండ‌క్ట‌ర్ మిష‌న్ 2.0ను ప్ర‌క‌టించ‌డం విశేషం. దీనికి 40 వేల కోట్లు(ఐదేళ్ల‌కు) కేటాయించారు. రైలు క‌నెక్టివిటీ పెంచ‌డం ఒక్క‌టే ఈ బ‌డ్జెట్‌లో ఒకింత ఆశాజ‌న‌కంగా ఉంది. అయితే.. ఇందులో మాత్ర‌మే.. ఎన్నికలు జ‌రిగే రాష్ట్రాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

ప‌శ్చిమ బెంగాల్‌లోని సిలిగురి, త‌మిళ‌నాడులోని చెన్నైవంటివి హైస్పీడ్ రైళ్ల‌లో చోటు ద‌క్కించుకున్నాయి. ఇక‌, హైద‌రాబాద్ గ‌త బడ్జెట్‌లోనే ప్ర‌క‌టించిన హైస్పీడ్ రైలుకు ఇప్పుడు మోక్షం ల‌భించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ప‌న్నుల విష‌యంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఒకింత ఊర‌ట ల‌భించింద‌నే చెప్పాలి. అదేస‌మ‌యంలో ఐటీఆర్‌ను పూర్తి స్వ‌తంత్రంగాదాఖ‌లు చేసుకునే వెసులుబాటు ల‌భించింది. మొత్తంగా చూస్తే.. ఈ బ‌డ్జెట్‌లో ఆశించిన మెరుపులు అయితే.. క‌నిపించ‌లేదు. కేవ‌లం.. బ‌డ్జెట్ పెట్టాలి కాబ‌ట్టి పెట్టారు.. అనే వాద‌నే బ‌లంగా వినిపిస్తోంది.