జనవరి నుంచే క్వాంటం హ‌బ్‌గా అమ‌రావ‌తి!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి.. జ‌న‌వ‌రి నుంచే  క్వాంటం హ‌బ్‌గా అభివృద్ధి చెందుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఐబీఎం సంస్థ వ‌చ్చే జ‌న‌వ‌రి క‌ల్లా రెండు క్వాంటం కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయ‌నుంద‌ని తెలిపారు. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో క్వాంటం కంప్యూటింగ్‌పై సుమారు 40 నిమిషాల పాటు చ‌ర్చించారు. అమ‌రావ‌తిని క్వాంటం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థిర నిశ్చ‌యంతో ఉన్నామ‌ని చెప్పారు. గ్లోబ‌ల్ క్వాంటం డెస్టినేష‌న్‌గా ఏపీని  మార్చాల‌నే దిశ‌గా ప‌నులు చేప‌డుతున్నామ‌న్నారు. దీనికోసం రెండు ద‌శ‌లుగా రోడ్ మ్యాప్ రూపొందించుకుని ముందుకెళుతున్నామ‌న్నారు.  

2030 క‌ల్లా అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ ప్ర‌పంచ స్థాయికి చేరుతుంద‌ని సీఎం వివ‌రించారు. ఇక్క‌డ నుంచి ఏటా 5వేల కోట్ల మేర క్వాంటం హ‌ర్డ్‌వేర్ ఎగుమ‌తుల‌ను సాధించాల‌న్న‌దే ల‌క్ష్య‌మ‌ని తెలిపారు.  అదేస‌మ‌యంలో  ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్య శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నామ‌ని తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ ప్రోత్స‌హ‌కాల‌తో క్వాంటం వ్యాలీలో క‌నీసం 100 స్టార్ట‌ప్‌లు ఏర్పాటు చేయాల‌నేది ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు వివ‌రించారు. మొత్తం 14 రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ తో అద్భుత ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని తెలిపారు.

ఇక‌, రాజ‌ధానిలో అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ నిర్మాణం కోసం ఇప్ప‌టికే 50 ఎక‌రాల‌ను కేటాయించామ‌ని.. భ‌విష్య‌త్తులో దీనిని మ‌రింత పెంచే ఉద్దేశం ఉంద‌న్నారు. క్వాంటం వ్యాలీ భ‌వ‌న నిర్మాణానికి సంబంధించి భ‌వ‌న న‌మూనాలు సిద్ధం చేశామ‌ని వెల్ల‌డించారు. ఈ భవనంలో దాదాపు 80 నుంచి 90 వేల మంది పనిచేయనున్నారని తెలిపారు. ఫ్యూచ‌ర్‌లో 3 లక్షల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్లు పనిచేయనున్నాయని చెప్పారు. ఇక్కడ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఐబీఎం, టీసీఎస్‌, ఎల్ అండ్ టీ  సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయ‌ని వివ‌రించారు.

ఇదేస‌మ‌యంలో జిల్లా స్థాయిలో ప్రజలు, విద్యార్థుల్లో క్వాంటం కంప్యూటింగ్‌పై క‌లెక్ట‌ర్లే అవగాహన కల్పించాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు. క్వాంటం కంప్యూటింగ్ అవ‌స‌రం, ప్రయోజనాల గురించి విద్యావంతులు, విద్యార్థుల‌కు కూడా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రధానంగా కళాశాలల్లో యువతకు దీనిపట్ల అవగాహన పెంపొందించి ఈ క్వాంటం కంప్యూటింగ్ కోర్సులు చదివేలా కూడా ప్రోత్సహించాలన్నారు.