వైసీపీ మాజీ మంత్రి ర‌జ‌నీకి సెగ‌.. వ్య‌తిరేక వ‌ర్గం భేటీ

వైసీపీ మాజీ మంత్రి, చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి వ్య‌తిరేక వ‌ర్గం నుంచి భారీ సెగ త‌గిలింది. ఆత్మీయ సమావేశం పేరిట వ్యతిరేక వర్గం భేటీ అయింది. దీనికి ముందు ర్యాలీగా తరలి వచ్చిన వ్యతిరేక వర్గం నేత‌లు.. ‘డౌన్ డౌన్ విడుదల రజిని’ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. గత ఐదు సంవత్సరాల్లో అరాచకాలు, అక్రమ వసూళ్లు, భూదందాలతో ఆమె అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని వ్య‌తిరేక‌వ‌ర్గం నాయ‌కులు నినాదాలు చేశారు.

ఇదేస‌మ‌యంలో ‘రజ‌ని వద్దు – జగన్ ముద్దు’ అంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిర‌స‌న కారులుగా మారిన వ్య‌తిరేక వ‌ర్గం కార్య‌క‌ర్త‌లు.. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం స్థానికంగా ఓ ఫంక్ష‌న్ హాల్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ.. మాజీమంత్రి విడుదల రజిని ఒక రాణిలాగా చిలకలూరిపేట స్థానికురాలి మాదిరిగా అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. సొంత పార్టీ వారిపై అక్ర‌మ కేసులు పెట్టించార‌ని ఆరోపించారు.

ఇలాంటి వారికి సపోర్ట్ చేసిన సిగ్గుతో తలదించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాలు నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అరాచ‌కాలు అన్నీ ఇన్నీ కావ‌ని తెలిపారు. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ర‌జ‌నీ వ్య‌వ‌హారం ఉంద‌ని అన్నారు. ఆమె కార‌ణంగా అనేక కుటుంబాలు అన్యాయంగా రోడ్డున ప‌డ్డాయ‌ని తెలిపారు. ఈమెను నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని నాయ‌కుడు డిమాండ్ చేశారు.