-->

ఆ మంత్రుల‌కు చంద్ర‌బాబు క్లాస్‌.. రీజ‌నేంటి ..!

మంత్రివ‌ర్గంలోని కొంద‌రికి మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు క్లాస్ ఇచ్చార‌ని తెలిసింది. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో కొల్లు ర‌వీంద్ర‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, సుభాష్, స‌విత‌, కొండ‌ప‌ల్లి రాం ప్ర‌సాద్, అనిత‌ల‌ వంటి కొంద‌రిని ప్ర‌త్యేకంగా త‌న ఛాంబ‌ర్‌లోకి పిలిచి వారితో మాట్లాడిన‌ట్టు తాజాగా తెలిసింది. ప‌నితీరుపై ఆయ‌న స‌మీక్షించార‌ని.. కొన్ని విష‌యాల్లో మంత్రుల వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టారని స‌మాచారం.

ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో మంత్రుల ప‌నితీరు బాగోలేద‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలిసింది. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంలోనూ.. కూట‌మి నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇవ్వడంలోనూ మంత్రులు వెనుక‌బ‌డిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో తాను చేయించిన స‌ర్వేల తాలూకు నివేదిక‌ల‌ను కూడా ఆయ‌న వారి ముందు పెట్టార‌ని తెలిసింది. ఆయా నివేదిక‌ల ఆధారంగా మంత్రుల‌ను కొన్నిప్ర‌శ్న‌లు కూడా అడిగిన‌ట్టు సీఎంవో వ్య‌వ‌హారాలు చూసే కీలక నాయ‌కుడు ఒక‌రు చెప్పుకొచ్చారు.

‘దీనిని క్లాస్ అని అన‌లేం కానీ.. సీఎం గ‌ట్టిగానే చెప్పారు. మంత్రుల ప‌నితీరు మార్చుకోవాలని మాత్రం చెప్పారు. ఇది వాస్త‌వ‌మే’ అని స‌ద‌రు నాయ‌కుడు వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రులు అనూహ్యంగా బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చారు. జ‌గ‌న్ స‌హా వైసీపీ నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబు క్లాస్ ఇచ్చార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. బుధ‌వారం అనూహ్యంగా ఇంత మంది మంత్రులు మీడియా ముందుకు రావ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది.

నిజానికి చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే ప‌లుమార్లు మంత్రుల‌కు క్లాస్ ఇచ్చారు. ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని.. పార్టీ కార్య‌క్రమాల‌కు హాజ‌రు కావాలని కూడా చెప్పుకొచ్చారు. దీంతో అప్ప‌ట్లో కొంద‌రు స్పందించారు. పార్టీ నాయకులతో క‌లివిడిగా ఉన్నారు. కానీ.. ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రుల‌కు ఉన్న కార్య‌క్ర‌మాల వ‌ల్ల కావొచ్చు.. లేదా, ఇత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోతున్నారు. దీనిపైనే చంద్ర‌బాబు ప‌లుమార్లు హెచ్చ‌రించా రు. అయిన‌ప్ప‌టికీ.. మార్పు క‌నిపించ‌డం లేద‌న్న‌ది చంద్ర‌బాబు వాద‌న‌. ఈ క్ర‌మంలోనే మంత్రుల‌కు క్లాస్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా మార్పు క‌నిపిస్తుందేమో చూడాలి.