ఫార్మాపై ట్రంప్ టారిఫ్ లు అమెరికాకు పిడుగుపాటే!

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటిదాకా విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న దాదాపుగా అన్ని వస్తువులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను భారీగా పెంచేశారు. ఫలితంగా అమెరికాలో ఆయా దేశాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఫార్మా రంగంపైనా కొత్త టారిఫ్ లను ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు.

ఇదే జరిగితే… అమెరికన్లకు ప్రస్తుతం తక్కువ ధరలకే దొరుకుతున్న ఔషధాలు ఇకపై మరింత ప్రియం కానున్నాయి. ఒక్కసారిగా వారి ఔషధాల ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. ఇప్పటికే ఇతర వస్తువుల ధరలు పెరిగిన కారణంగా గగ్గోలు పెడుతున్న అమెరికన్లు.. తమ ఆరోగ్యంపైనా అధిక మొత్తాలను వెచ్చించాల్సి వస్తే… అది వారికి పిడుగుపాటేనని చెప్పక తప్పదు.

ప్రస్తుతం అమెరికాలో ఔషధాల ఉత్పత్తి అన్న మాటే లేదు. అమెరికన్లు వాడుతున్న అన్ని రకాల ఔషధాలు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. ప్రత్యేకించి భారత్ లో ఉత్పత్తి అవుతున్న జనరిక్ ఔషధాల్లో 40 శాతం మేర అమెరికాకే వెళుతున్నాయి. ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపైనా సుంకాలు పెంచితే.. ఆ ప్రభావం భారత ఔషధ రంగంపై పడటం ఖాయమే. అయితే అమెరికాకు చైనా లాంటి ఇతర దేశాలు కూడా ఔషధాలను ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల మాదిరిగానే భారత్ పైనా ప్రభావం పడుతుంది తప్పించి ప్రత్యేకించి ఒక్క భారత్ పైనే ఈ ప్రభావం ఉంటుందని చెప్పలేం.

అయితే భారత్ నుంచి మెజారిటీ జనరిక్ ఔషధాలను అమెరికా వినియోగిస్తున్నందున ఆ ప్రభావం ఇతర దేశాల కంటే భారత్ పై ఒకింత అధికంగా ఉంటుంది. అయితే అంతకంటే ముందే… భారత్ నుంచి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలను ప్రస్తుతం అతి తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్న అమెరికన్లు.. ట్రంప్ టారిఫ్ ల దెబ్బతో మరింత మేర అధిక మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది.

ఈ లెక్కన ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం ఇతర దేశాలపై ఏ రీతిన ప్రభావం చూపుతుందన్న విషయాన్ని పక్కనపెడితే… అమెరికా అధ్యక్ష హోదాలో ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్ లను పెంచితే.. ఆ ప్రభావం తొలుత అమెరికన్లపైనే పడుతుందని చెప్పక తప్పదు. అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ విదేశాల దిగుమతులపై ఏకంగా యుద్ధమే ప్రకటించినట్లుగా సాగుతున్నారు. ఫార్మా రంగంపైనా ఆయన సుంకాలను అధికం చేస్తే… ఆ పరిస్థితి అమెరికన్లను మరింతగా ఇబ్బందుల పాలు చేస్తుంది.

అయితే ఫార్మా రంగంపై ట్రంప్ ఎంతమేర టారిఫ్ లను పెంచుతారన్న దానిపై ఈ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే.. ఫార్మా రంగంపైనా ట్రంప్ టారిఫ్ లు భారీగానే పెరిగే అవకాశాలున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి. అదే జరిగితే.. అమెరికన్లు ఔషధాలను కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురిస్తే… ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడినట్టేనన్న వాదనలు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇదే జరిగితే.. ట్రంప్ తన సొంత దేశంలోనే మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంటారని చెప్పాలి.